Team India | నాగ్‌పూర్ : చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు ఆ దిశగా తొలి అడుగును విజయంతో ప్రారంభించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన రోహిత్ సేన.. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల ఛేదనను మరో 12 ఓవర్లు మిగిలుండగానే పూర్తిచేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఛేదనలో శుభ్‌మన్ గిల్ (96 బంతుల్లో 87, 14 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47 బంతుల్లో 52, 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో టీమ్ఇండియా అలవోక విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. సారథి జోస్ బట్లర్ (67 బంతుల్లో 52, 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51, 3 ఫోర్లు, 1 సిక్స్), ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. రవీంద్ర జడేజా (3/26) స్పిన్ మాయాజాలానికి తోడు అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా (3/53) బట్లర్ సేనను కట్టడి చేశారు. గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
మోస్తరు ఛేదనలో భారత్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డే ఆడుతున్న యశస్వీ జైస్వాల్ (15) మూడు బౌండరీలు కొట్టి జోరు మీద కనిపించినా ఆర్చర్ ఐదో ఓవర్లో మూడో బంతికి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఏడాదికాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సారథి రోహిత్ (2)..మరోసారి నిరాశపరిచాడు. కానీ గిల్‌కు శ్రేయస్ జతకలవడంతో భారత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. క్రమశిక్షణ కోల్పోయాడనే కారణంతో బీసీసీఐ ఆగ్రహానికి గురై సుమారు ఏడాదిన్నర విరామం తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్.. వన్డే ఫార్మాట్లో తాను ఎందుకంత కీలకమో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. వన్డేలకు టీ20 తరహా బాదుడును జోడించిన అయ్యర్.. ఆర్చర్ 7వ ఓవర్లో చివరి రెండు బంతులను మిడ్‌వికెట్, థర్డ్‌మ్యాన్ దిశగా భారీ సిక్సర్లు బాదాడు. కార్స్ 10వ ఓవర్లో మూడు సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. అయ్యర్ దూకుడుకు గిల్ నిలకడ తోడవడంతో స్కోరుబోర్డు వేగం పరుగులు పెట్టింది. శ్రేయస్ దూకుడుతో 30 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తయింది. కానీ ఫిఫ్టీ అనంతరం బెతెల్ బౌలింగ్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరంభ ఓవర్లలో దూకుడుగా ఆడింది. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ (29 బంతుల్లో 32, 6 ఫోర్లు) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. హర్షిత్ రాణా వేసిన మొదటి ఓవర్లో రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సాల్ట్.. అతడే వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 6, 4, 6, 4, 6తో 26 పరుగులు పిండుకున్నాడు. డకెట్ సైతం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన హార్దిక్ ఆతిథ్య జట్టుకు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన సాల్ట్.. మూడో పరుగు కోసం యత్నించాడు. కానీ శ్రేయస్ అయ్యర్ అద్భుత త్రో తో సాల్ట్ రనౌట్ అవడంతో 75 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
సాల్ట్ నిష్క్రమణ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. హర్షిత్ మూడు బంతుల వ్యవధిలో డకెట్‌తో పాటు ప్రమాదకర హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేశాడు. జో రూట్ (19) జడేజా మాయ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ క్రమంలో సారథి బట్లర్, ఆల్‌రౌండర్ బెతెల్ ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. బట్లర్ 58 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేశాక అక్షర్ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. లివింగ్స్టన్ (5)ను రాణా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు కుదేలైంది. 42వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన బెతెల్‌ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
శ్రేయస్ ఔట్ అయినా భారత్ దూకుడు తగ్గలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన అక్షర్‌తో కలిసి గిల్ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ ద్వయం రన్‌రేట్ 6కు తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. 60 బంతుల్లో గిల్ అర్ధ శతకం పూర్తయింది. కార్స్ 29వ ఓవర్లో ఈ ద్వయం తలా రెండు ఫోర్లు కొట్టడంతో భారత స్కోరు 30 ఓవర్లకే 200 పరుగుల మార్కును దాటింది. 46 బంతుల్లో 50 రన్స్ చేసిన అక్షర్.. విజయానికి 28 పరుగుల దూరంలో నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ (2) విఫలమవగా శతకం దిశగా సాగిన గిల్ కూడా బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ హార్దిక్ (9 నాటౌట్), జడేజా (12 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశారు.
1 మూడు ఫార్మాట్లలో కలిసి అరంగేట్ర మ్యాచ్‌లలో 3 వికెట్లు తీసిన తొలి బౌలర్ హర్షిత్.
ఇంగ్లండ్: 47.4 ఓవర్లలో 248 ఆలౌట్ (బట్లర్ 52, బెతెల్ 51, జడేజా 3/26, రాణా 3/53;
భారత్: 38.4 ఓవర్లలో 251/6 (గిల్ 87, శ్రేయస్ 59, రషీద్ 2/49, సకిబ్ 2/47)