గౌహతి: టీమింండియా కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill).. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే శనివారం నుంచి గౌహతిలో ప్రారంభంకానున్న రెండో టెస్టుకు అతను దూరం అయ్యాడు. భారత బృందం నుంచి అతన్ని తప్పించారు. మెడ పట్టేయడంతో అతను ఫస్ట్ టెస్టులో బ్యాటింగ్ చేస్తూ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. కోల్‌కతా నుంచి భారత జట్టుతోనే గౌహతికి గిల్ పయనమయ్యాడు. కానీ గురువారం జరిగిన ప్రాక్టీస్‌లో అతను పాల్గొనలేదు. దీంతో అతను రెండో టెస్టులో ఆడుతాడో లేదో స్పష్టంగా తెలియలేదు. కానీ ఇవాళ ఉదయం అతను గౌహతి నుంచి ముంబైకి వెళ్లిపోయాడు. ముంబైలోని స్పెషలిస్టు డాక్టర్ దిన్షా పర్దివాలాను గిల్ కలవనున్నాడు. చికిత్స కోసం ముంబైకి వెళ్లడంతో రెండో టెస్టులో గిల్ ఆడడం లేదన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఫైనల్ ఫిట్నెస్ పరీక్ష చేయించుకోనున్నాడు.
గిల్ స్థానంలో జట్టు సారథ్య బాధ్యతలను రిషబ్ పంత్‌కు అప్పగించారు. రెండో టెస్టుకు పంత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గిల్ స్థానంలో సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో టెస్టుకు నితీశ్ రెడ్డికి కూడా ఛాన్స్ వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గిల్ ఫిట్నెస్ విషయంలో తప్పు చేయబోమని బ్యాటింగ్ కోచ్ సీతాంన్షు కోటక్ తెలిపారు. అతను బాగానే రికవరీ అవుతున్నట్లు చెప్పాడు. ఫిజియో, డాక్టర్లు నిర్ణయం తీసుకున్న తర్వాతే.. అతను తుది జట్టులో ఉంటాడో లేదో తెలుస్తుందన్నారు.
కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ఇండియా 30 రన్స్ తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్నది.