Shubman Gill : ఆసియా కప్ కోసం భారత టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న గిల్ శుక్రవారం సాయంత్రం ఫిట్నెస్ టెస్టు (Fitness Test) కోసం బెంగళూరు చేరుకున్నాడు. అక్కడి జాతీయ క్రికెట్ అకాడమీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లో అతడు ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆసియా కప్ బృందంలోని ప్రతిఒక్కరికి ఫిట్నెస్ టెస్టు తప్పనిసరి అని బీసీసీఐ స్పష్టం చేసినందున.. ఆరోగ్యం మెరుగవ్వడంతో ఈ వైస్ కెప్టెన్ ఫిట్నెస్ చాటుకునేందుకు రెడీ అయ్యాడు.
ఆసియా కప్ టోర్నీకి పది రోజులే ఉన్నందున భారత క్రికెటర్లు ఫిట్నెస్ మీద దృష్టి సారించారు. అనారోగ్యం కారణంగా దులీప్ ట్రోఫీకి దూరమైన గిల్‌కు సైతం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతడు ఏరోజు యో యో టెస్టులో పాల్గొంటాడనేది తెలియాల్సి ఉంది. ఆసియా కప్ కోసం భారత బృందం దశలవారీగా దుబాయ్‌కు చేరుకోనుంది.
Vice-captain Shubman Gill kicks off his training ahead of the Asia Cup. 🔥🇮🇳#Cricket #ShubmanGill #AsiaCup #Sportskeeda pic.twitter.com/JI8o4DHbto
— Sportskeeda (@Sportskeeda) August 29, 2025
సెప్టెంబర్ 4న అందరూ కలిసి.. తమకు కేటాయించిన హోటల్‌కు వెళ్తారు. మరుసటి రోజు ఐసీసీ అకాడమీలో నెట్స్‌లో సాధన మొదలు పెడుతారు. అయితే.. వైస్ కెప్టెన్ బెంగళూరు నుంచే యూఏఈకి వెళ్తాడని సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సారథిగా మెప్పించిన గిల్ పొట్టి ఫార్మాట్లోనూ చెలరేగిపోవాలని భావిస్తున్నాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో భారత్ ఫేవరెట్‌గా ఆడనుంది. ఇప్పటివరకూ ఎనిమిది సార్లు (ఏడుసార్లు వన్డే ఫార్మాట్లో, ఒకసారి టీ20 ఫార్మాట్లో) ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా తొమ్మిదో ట్రోఫీపై గురి పెట్టింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా బృందం సెప్టెంబర్ 4న దుబాయ్‌కు చేరుకోనుంది. తొలి పోరులో భాగంగా ఆతిథ్య యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న పాకిస్థాన్ జట్టును, సెప్టెంబర్ 19న పసికూన ఒమన్ టీమ్‌ను టీమిండియా ఢీకొట్టనుంది.