ముంబై : ఇండియన్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer).. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. డైవింగ్ చేస్తూ క్యాచ్ అందుకోబోయిన అయ్యర్‌కు గాయమైంది. దీంతో అతని స్ప్లీన్ భాగంలో తీవ్ర స్థాయిలో రక్త స్త్రావం అయ్యింది. సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు అతను దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయ్యర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు చాలా సమయం పడుతుందని ఓ నివేదిక ద్వారా తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత శ్రేయాస్ తీవ్ర స్థాయిలో ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలో అతని ఆక్సిజన్ 50కి పడిపోయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతను కనీసం పది నిమిషాలు కూడా నిలబడలేకపోయాడని చెప్పారు. అతను పూర్తిగా బ్లాకౌట్‌కు గురయ్యాడని, మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేందుకు చాలా సమయం పట్టిందని ఒకరు వెల్లడించారు.
ఆస్ట్రేలియా సిరీస్‌లో అయ్యర్ రెండు వన్డేల్లో 72 రన్స్ చేశాడు. అడిలైడ్ వన్డేలో రోహిత్ శర్మతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శ్రేయాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌కు అతను అండగా ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆడిన 11 వన్డేల్లో అయ్యర్ 49 సగటుతో 496 రన్స్ చేశాడు.