Shreyas Iyer | ఢిల్లీ: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు పదేండ్ల విరామం తర్వాత ఐపీఎల్ ట్రోఫీని అందించినా రిటెన్షన్ జాబితాలో చోటు కోల్పోయిన ఆ జట్టు మాజీ సారథి త్వరలోనే తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ధర వద్ద పరస్పర అంగీకారం కుదరకపోవడంతో కేకేఆర్‌ను వీడిన అయ్యర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుని సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని ఢిల్లీ యాజమన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రిటెన్షన్ ముగిసిన నేపథ్యంలో ఢిల్లీ వద్ద రూ. 73 కోట్ల నగదు ఉండగా దీనిలో ఎక్కువమొత్తం అయ్యర్‌కే వెచ్చించి మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాలనే భావనలో ఉన్నట్టు సమాచారం.
రిషభ్ పంత్‌ను రిటైన్ చేసుకోకపోవడంతో ఢిల్లీకి కెప్టెన్ అవసరమొచ్చింది. కాగా తమకు ట్రోఫీ అందించిన సారథిని పక్కనబెట్టారని వస్తున్న విమర్శలపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ స్పందించాడు. అయ్యర్‌ను తాము తొలి రిటెన్షన్‌గా అనుకున్నప్పటికీ అది సాధ్యపడలేదని, అతడు వేలంలోకి వెళ్లేందుకే ఆసక్తి చూపినట్టు వెంకీ తెలిపాడు. ఇదిలాఉండగా కేఎల్ రాహుల్ కోసం ఆర్సీబీ, ఇషాన్ కిషన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ భారీగా వెచ్చించేందుకు సిద్ధమైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.