ముంబై: స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) గ్రౌండ్లో అడుగుపెట్టడం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతను గాయపడ్డ విషయం తెలిసిందే. క్యాచ్ అందుకోబోయి కింద పడ్డ అయ్యర్‌కు .. కడుపులో మోచేయి వత్తేసింది. దీంతో అతని ప్లీహం(స్ప్లీన్) దెబ్బతిన్నది. దాని నుంచి రక్తస్త్రావం జరిగింది. అయితే ప్రమాదం నుంచి ఇంకా కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్.. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఓ నివేదిక ప్రకారం మాత్రం ప్రమాదం తర్వాత అయ్యర్ సుమారు ఆరు కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అతని మాంస కణజాలం తగ్గడం వల్ల బరువు చాలా వేగంగా కోల్పోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ ఆడే అవకాశాలు ఉన్నట్లు ఓ మీడియా కథనాన్ని రాసింది. జనవరి 3, 6వ తేదీల్లో జరిగే మ్యాచుల్లో అతను ఆడుతాడని డౌట్ వ్యక్తం చేసింది. దీంతో కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటులో ఉంటాడని కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే శ్రేయార్ అయ్యర్ 50 ఓవర్ల మ్యాచ్ ఆడగలడా లేదా అన్నది సందేహంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కడుపు సర్జరీ కావడం వల్ల అతను ఫిజికల్‌గా గ్రౌండ్లో గడపడం ఎంత వరకు వీలు అవుతుందో తెలియదన్నారు. కానీ శ్రేయాస్ మాత్రం స్కిల్ ట్రైనింగ్ ప్రారంభించాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. 50 ఓవర్లకు తగినట్లు అతను ఫీల్డింగ్ చేయగలిగితే అప్పుడు విజయ్ హజారేలో ఆడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.