Asia Cup 2025 Squad | వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియా కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను జట్టులో చోటు కల్పించకపోవడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటిన, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకు నడిపించిన అయ్యర్‌కు 15 మంది సభ్యుల జట్టులోనే కాకుండా, ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో కూడా చోటు దక్కలేదు. దాంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ ఆటగాడు కనీసం రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో కూడా ఎలా లేడో నాకు అర్థం కావడం లేదు. అతడిని 20 మందితో కూడిన జట్టులో ఎందుకు తీసుకోలేదో తెలియడం లేదు.
ఈ నిర్ణయం అతనికి జట్టులో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే స్పష్టమైన సంకేతం ఇస్తుంది’ అని పేర్కొన్నాడు. సెలక్షన్ అనేది కేవలం ఆటగాడి ప్రతిభను మాత్రమే కాకుండా, కొంతమంది వ్యక్తుల ఇష్టాలకు ఆధారపడి ఉండవచ్చని నాయర్ వ్యాఖ్యానించాడు. అయితే, జట్టులో చోటు కల్పించకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. ‘శ్రేయస్ తప్పేమీ లేదు. తాము కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేయగలం. ప్రస్తుతానికి అతను తన అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే’ అని కామెంట్ చేశాడు. అలాగే, అభిషేక్ శర్మ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు కావడంతో యశస్వి జైస్వాల్ వంటి ఆటగాడిని పక్కన పెట్టడం అనివార్యమైందని అగార్కర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ 17 మ్యాచ్‌లలో 175.07 స్ట్రయిక్ రేట్‌తో 604 పరుగులు చేసి, అత్యధిక స్కోరర్ చేసిన ఆరో ప్లేయర్‌గా నిలిచాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆటగాడిని కీలకమైన టోర్నమెంట్‌కు ఎంపిక చేయకపోవడంపై క్రీడా వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.