న్యూఢిల్లీ: రెజ్లర్ వినేశ్ పోగట్(Vinesh Phogat)కు భారతీయ రెజ్లింగ్ సమాఖ్య షోకాజ్ నోటీసు జారీ చేసింది. క్రమశిక్షణారహిత్యానికి పాల్పడిందని, యాంటీ డోపింగ్ రూల్స్‌ను అతిక్రమించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది జూన్ వరకు వినేశ్ ఎటువంటి టోర్నీల్లో పాల్గొనడానికి అర్హురాలు కాదని రెజ్లింగ్ సమాఖ్య పేర్కొన్నది. డబ్ల్యూఎఫ్ఐ 15 పేజీల నోటీసును జారీ చేసింది. వినేశ్ ప్రవర్తన వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చినట్లు ఆ నోటీసులో తెలిపారు. భారతీయ రెజ్లింగ్ వ్యవస్థ ఇమేజ్ను డ్యామేజ్ చేసిందని, డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలను ఆమె ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.
నాలుగు తీవ్రమైన ఆరోపణలు చేసిన ఫెడరేషన్.. వాటిపై వినేశ్‌ను వివరణ కోరింది. 2024 ఒలింపిక్స్‌లో బరువు వల్ల అనర్హత, యాంటీ డోపింగ్ రూల్స్‌ను విస్మరించడం, 2024 మార్చి సెలక్షన్ ట్రయల్స్‌లో రెండు కేటగిరీల్లో పాల్గొనడం వంటి అంశాలపై వినేశ్ పోగట్ వివరణ ఇవ్వాలని రెజ్లింగ్ సమాఖ్య కోరింది. అయితే జూన్ వరకు వినోశ్ ఎటువంటి దేశీయ టోర్నీల్లో పాల్గొనడానికి అర్హురాలు కాదని సమాఖ్య చెప్పింది.
మే 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గోండాలో జరిగే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో కూడా పాల్గొనేందుకు అనుమతి లేదని రెజ్లింగ్ సమాఖ్య చెప్పింది. షోకాజ్ నోటీసులపై పోగట్ 14 రోజుల్లోగా స్పందించాల్సి ఉంటుంది.