Manu Bhaker | దేశ క్రీడా రంగ ప్రతిష్ఠాత్మక అవార్డు ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న విజేతలను కేంద్రం త్వరలో ప్రకటించనుంది. అయితే, ఈ పురస్కారానికి సిఫారసు చేసిన జాబితా నిన్న బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో (Paris Olympics) రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన స్టార్ షూటర్ మనూ భాకర్ (Manu Bhaker) పేరు లేకపోవడం సంచలనం రేపుతోంది. ఈ అంశంలో కేంద్రంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే, పురస్కారానికి ఇంకా తుది ప్రతిపాదనల జాబితా సిద్ధం కాలేదని, అందులో మను పేరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో ఆమె ఈ అవార్డు కోసం అసలు దరఖాస్తు చేసుకోలేదనే వార్తలు వస్తున్నాయి. కానీ మనూ ఈ అవార్డుకు దరఖాస్తు చేసిందని మర్చంట్ నేవీలో చీఫ్ ఇంజినీర్ అయిన షూటర్ తండ్రి రామ్ కిషన్ (Ram Kishan) చెబుతుండడం గమనార్హం. ఈ అంశంలో రామ్‌కిషన్ తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. తన కుమార్తెను షూటర్‌ను కాకుండా క్రికెటర్‌ను చేసి ఉండాల్సిందని.. అప్పుడు మనూకు మరింత గుర్తింపు వచ్చేదని వ్యాఖ్యానించారు.
‘ఆమెను షూటర్‌ను చేసినందుకు చింతిస్తున్నాను. షూటర్‌కు బదులు మనూను క్రికెటర్ని చేసి ఉండాల్సింది. అప్పుడు తనకి అన్ని అవార్డులు, ప్రశంసలు దక్కేవి. మనూ ఒకే ఎడిషన్‌లో రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. ఇంత వరకూ ఎవరూ అలా చేయలేదు. తన కృషికి తగిన గుర్తింపు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఖేల్ రత్న అవార్డు కోసం మను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది. తన పేరును ప్రభుత్వం పరిశీలిస్తుందని భావించింది. తీరా నామినీల లిస్ట్‌లో పేరు లేకపోవడంతో మనూ తీవ్ర ఆవేదనకు లోనైంది. తాను అసలు క్రీడాకారిణి కాకుండా ఉండాల్సిందని.. ఒలింపిక్స్‌కు వెళ్లి దేశానికి పతకాలు సాధించి ఉండాల్సింది కాదంటూ నా కూతురు తీవ్ర మనోవేదనకు గురైంది. ఒకవేళ ఆమె ఈ అవార్డుకు దరఖాస్తు చేయకపోయినా, తన ఘనతను చూసి కమిటీ ప్రతిపాదించాల్సింది’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read..
Vinod Kambli | వారి వల్ల నేను బతికి ఉన్నాను : వినోద్ కాంబ్లి
Rohit Sharma: మోకాలి గాయంపై ఆందోళన వద్దు: రోహిత్ శర్మ
Ben Stokes: బెన్ స్టోక్స్ 3 నెలలు క్రికెట్‌కు దూరం