Ganguly | తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఈడెన్ గార్డెన్ పిచ్‌పై పెద్ద దుమారమే రేగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. మెడ గాయంతో ఆసుప్రతిలో చేరి మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే, పిచ్ తొలి రోజు నుంచే బంతి బౌన్స్‌తో పాటు టర్న్ అవడం కనిపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అభిమానులతో పాటు మాజీలు సైతం టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో పాటు ప్రశ్నలు లేవనెత్తారు. టెస్ట్ కోచ్‌గా గంభీర్‌ను తొలగించాలని డిమాండ్లు కూడా వచ్చాయి. తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, క్యాబ్ చీఫ్ సౌరవ్ గంగూలీ గంభీర్‌ను తొలగించాలనే డిమాండ్లపై స్పందించారు. గౌతమ్ గంభీర్‌ను తొలగించే ప్రశ్నే లేదని.. శుభ్‌మన్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌లో రాణించిందని గుర్తు చేశారు మాజీ కెప్టెన్.
స్వదేశంలోనూ గొప్పగా రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను ఇలా ఎందుకు తయారు చేశారనే దానిపై చర్చ సాగుతుండగా.. ఓ చర్చలో ఈ విషయంలో మిమ్మల్ని సంప్రదించారా? అని ప్రశ్నించగా.. గంగూలీ మాట్లాడుతూ ఇందులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. టెస్టు మ్యాచుకు నాలుగు రోజుల ముందు వికెట్ తయారీ పనిని బీసీసీఐ క్యూరేటర్లు చేపడుతారని.. క్యాబ్‌కు సొంత క్యూరేటర్ బృందం ఉంటుందన్నారు. కానీ, టీమిండియా మేనేజ్మెంట్ నుంచి రిక్వెస్ట్‌లు వస్తాయని.. వారి అభ్యర్థలన మేరకు పిచ్ తయారు చేస్తారన్నారు. ఈడెన్ గార్డెన్స్ భారత బ్యాట్స్‌మెన్‌కు పిచ్ అనుకూలంగా లేదని బీసీసీఐ మాజీ చైర్మన్ అంగీకరించారు. ఈడెన్ గార్డన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ సైతం స్పందించారు. టీమ్ మేనేజ్మెంట్, కోచ్ కోరిక మేరకు పిచ్ తయారు చేసినట్లు సుజన్ స్పష్టం చేశారు.