న్యూఢిల్లీ: రీఎంట్రీలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు షాక్ తగిలింది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనాలన్న ఆమె ఆశలు గల్లంతయ్యాయి. మెగా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆమె నిరాశపరిచింది. శనివారం జరిగిన మహిళల 53 కిలోల విభాగం సెమీఫైనల్ బౌట్లో వినేశ్ 4-6 తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో జ్యోతిపై 7-1 తో విజయం సాధించిన ఫొగాట్ క్వార్టర్ ఫైనల్లో నిషుపై నెగ్గేందుకు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఇక, ట్రయల్స్ ప్రారంభానికి ముందు వినేశ్‌ను 50 కిలోల విభాగంలోనే అనుమతిస్తామని డబ్ల్యూఎఫ్ఐ చెప్పగా.. రెజ్లర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ జోక్యం చేసుకుని వినేశ్‌ను 53 కిలోల విభాగంలోపోటీ పడేందుకు అనుమతించారు. కాగా, సెలెక్షన్ ట్రయల్స్ సెమీస్‌లో ఓడినా బాధపడటం లేదని, తాను మొత్తం వ్యవస్థతో పోరాడు తున్నానని వినేశ్ చెప్పింది.మరో రెండేండ్లు రెజ్లింగ్‌లో ఉంటానని స్పష్టం చేసింది.