Shoaib Akhtar : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్(India), పాకిస్థాన్(Pakistan) జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దాంతో, ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటున్నాయి. త్వరలో భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023)లో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే.. ఇప్పటి నుంచే ఆ మ్యాచ్‌పై అంచనాలు పెంచేసేలా మాజీలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) మాట్లాడుతూ.. వచ్చే నెల 14న అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా జరుగనున్న మెగా ఫైట్‌లో టీమ్ఇండియాపైనే ఒత్తిడి అధికంగా ఉంటుందని అన్నాడు.
‘వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై అశేష ప్రేక్షకుల మధ్య ఆడనున్న టీమ్ఇండియాపైనే ఎక్కువ ప్రెషర్ ఉండనుంది. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ జట్టే మెరుగైన ప్రదర్శన చేస్తుంది. ఈ టోర్నీ ద్వారా భారత క్రికెట్‌కు కాసుల పంట పండనుంది. ప్రసార మాధ్యమాల్లో భారత్, పాక్ పోరును ఇప్పటికే మహాభారతంలా చిత్రీకరిస్తున్నారు. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియాను విజేతగాను తేల్చేశారు కూడా. అయితే.. ఇదంతా మ్యాచ్‌కు ముందు రోహిత్ సేనపై ఒత్తిడి పెంచుతుంది అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
గత రెండేండ్లుగా ఇరు జట్ల ఆటతీరును పరిశీలిస్తే.. భారత్ కంటే పాకిస్థాన్ ఎంతో మెరుగ్గా ఉందని అక్తర్ వ్యాఖ్యానించాడు. టీమ్ఇండియా తుది జట్టు కూర్పుపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదని, అదే పాక్ విషయానికి వస్తే.. చాన్నాళ్లుగా బాబర్ సైన్యం నిలకడైన ప్రదర్శన చేస్తున్నదని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ వెల్లడించాడు. రెండేండ్లుగా భారత్ తుది జట్టు స్థిరంగా లేదు. నాలుగో స్థానంలో ఆడే ప్లేయర్ ఎవరో ఇప్పటి వరకు నిర్ణయించలేకపోయారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
దాంతో, కోహ్లీ, రోహిత్ నిరంతరం మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో నాకు అర్థం కాలేదు. కింది స్థాయిలో బ్యాటింగ్ చేయగలవాళ్లు ఉండాలని భారత్ భావిస్తుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. టాప్-5 ఆటగాళ్లు ఆడలేని చోట 8వ, 9వ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాళ్ల నుంచి మరీ ఎక్కువగా ఆశించడం తప్పే’ అని అక్తర్ అన్నాడు. ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఈ నెల 10 సూపర్-4 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.