Shoaib Akhtar | యూఏఈ వేదికగా ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తప్పుపట్టాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను భారత స్పిన్నర్లు కుప్పకూల్చారు. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాహిబ్ జాదా ఫర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టు 15.5 ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే, టోర్నీ ప్రారంభం నుంచి దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తూ వస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేయాలన్న సల్మాన్ నిర్ణయంపై అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్తర్ మాట్లాడుతూ ‘టాస్ సమయంలో సూర్య కుమార్ యాదవ్ పిచ్ రిపోర్ట్ మొత్తం చెప్పేశాడు. సెకండ్ బ్యాటింగ్ సమయంలో మంచు ఉంటుంది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పాడు. బంతి బ్యాట్‌పైకి వస్తుంది. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. టాస్ గెలిచినా తాము బౌలింగ్ ఎంచుకునేవాడమని చెప్పాడు. కానీ, మన ఐన్‌స్టీన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు’ అని అక్తర్ విమర్శించాడు. ఇంకా అక్తర్ మాట్లాడుతూ.. ‘నాకు మాటలు రావడం లేదు. చూడటానికి బాధగా ఉంది. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. భారత్‌కు హ్యాట్సాఫ్. క్రికెట్‌ను రాజకీయం చేయొద్దు. మేం మీ గురించి మంచి విషయాలు చెప్పాం. కరచాలనం చేయకపోవడం చాలా విషయాలు చెప్పగలం. మీ ఇంటి సొంతింటిలో కూడా గొడవలు జరుగుతాయి. అవన్నీ మరిచిపోయి ముందుకు సాగండి. ఇది క్రికెట్ గేమ్. కరచాలనం చేయండి..’ అంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు.