హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన డీఎస్పీ నిఖత్ జరీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి సోమవారం అభినందించారు. అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన నిఖత్‌ను డీజీపీ కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, తెహ్రీ లేక్ వేదికగా ఏప్రిల్ 8 నుండి 12 వరకు నిర్వహించిన 25వ ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ పోటీల్లోనూ సత్తాచాటిన తెలంగాణ పోలీసులనూ డీజీపీ అభినందించారు. రోయింగ్ కాక్స్ లెస్ పెయిర్ – 500 మీటర్ల విభాగంలో 1వ బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎన్. రామకృష్ణ, సీఏఆర్ సిద్దిపేటకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ జె.రాజు అద్భుత ప్రతిభను కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.