భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత దశాబ్దిలో టీమ్ఇండియాకు రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పరుగుల వరద పారించిన ధావన్.. 13 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు.అభిమానులు ‘గబ్బర్’ అని పిలుచుకునే ధావన్.. జాతీయ జట్టులో కుర్రాళ్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక రేసులో వెనుకబడ్డాడు.
Shikhar Dhawan | ఢిల్లీ: టీమ్ఇండియా గబ్బర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ధావన్.. 13 ఏండ్ల కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నట్టు శనివారం ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించాడు. 2010లో జాతీయ జట్టులోకి వచ్చిన ధావన్.. చివరిసారిగా 2022లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. సెహ్వాగ్, గంభీర్ వంటి ఓపెనర్లు కెరీర్ చరమాంకంలో ఉండగా టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. వారిని మరిపిస్తూ రోహిత్‌తో రికార్డు భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
ఆఫ్‌సైడ్ అదిరిపోయే ఆటతో, చూడముచ్చటైన కవర్ డ్రైవ్‌లతో అభిమానులను అలరించిన అతడు జాతీయ జట్టులో యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న పోటీతో పాటు వయసు, ఫిట్నెస్ సమస్యలతో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపాడు.
ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ.. ‘నా ఈ క్రికెట్ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు. ముందుకెళ్తే కొత్త జీవితం. లైఫ్‌లో నాకు దేశానికి ఆడాలనే లక్ష్యం ఒకటే ఉండేది. అదృష్టం కొద్దీ అది నన్ను వరించింది. నాకు అండగా నిలిచి, నాకు ప్రేమను పంచినవారందరికీ ధన్యవాదాలు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్’ అని వీడియోలో పేర్కొన్నాడు.
2004లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలు చేసిన ధావన్ జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2010లో అతడికి వన్డేలలో తొలి అవకాశం వచ్చినా మొదటి మ్యాచ్‌లోనే డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత జట్టులోకి వస్తూ పోతూ ఉన్నా 2013 నుంచి మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ ఏడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ శర్మతో కలిసి ధావన్ సంచలన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
అదే ఏడాది ఆస్ట్రేలియాతో మొహాలీ టెస్టులో భారీ శతకంతో రికార్డులు నెలకొల్పడంతో ఇక అప్పట్నుంచి అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ధోనీ హయాంలో 2013 నుంచి 2019 మధ్య రోహిత్, కోహ్లీతో కలిసి ధావన్ ఓ వెలుగు వెలిగాడు. 2013, 2017 చాంపియన్స్ ట్రోఫీలలో అత్యధిక పరుగులు చేసి ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డులు సొంతం చేసుకున్నాడు.
2018 తర్వాత టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన ధావన్ క్రమంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కూ దూరమవుతూ వచ్చాడు. ఆటతో పాటు కుటుంబ సమస్యలతో సతమతమైన అతడిని టెస్టులతో పాటు టీ20లలోనూ సెలక్టర్లు పక్కనబెట్టినా వన్డేలలో మాత్రం తరుచుగా ఆడాడు. ఒక దశలో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే వంటి పర్యటనలలో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథిగానూ వ్యవహరించాడు. ధావన్ చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ వంటి కుర్రాళ్ల రాకతో సెలక్టర్లు ధావన్‌ను పూర్తిగా పక్కనబెట్టేశారు.
జీవితంలో ముందుకెళ్లాలంటే కొన్ని పేజీలు తిప్పక మానదు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఈ సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతుంటే నా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. నా దేశం కోసం నేను ఎంతో ఆడా. ఇకపై మళ్లీ నాకు ఆ అవకాశం రాకపోవచ్చు. కానీ అందుకు బాధపడాల్సిన అవసరం లేదని నా మనసుకు చెప్పుకున్నా – ధావన్
రోహిత్-ధావన్ ఓపెనింగ్ భాగస్వామ్యం 117 ఇన్నింగ్స్‌లలో 5,193 పరుగులు. భారత్‌లో సచిన్, గంగూలీ (6,609) తర్వాత ఇదే అత్యధికం.
114, 102, 48, 68, 31, 68, 125, 78, 46, 21
2013, 2017 చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2015 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు. అంతేగాక ఐసీసీ టోర్నీలలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్. అందుకే అభిమానులు అతడిని ‘మిస్టర్ ఐసీసీ’గా పిలుస్తారు.
వందో వన్డేలో ఆడుతూ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ ధావన్.