పేస్ ఆల్‌రౌండర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా.. ప్రధాన పేసర్ గాయపడ్డ క్లిష్ట సమయంలో నేనున్నానంటూ బాధ్యతలు భుజానెత్తుకున్న శార్దూల్ ఠాకూర్ సార్థక నామధేయుడు అనిపించుకున్నాడు! సంస్కృతంలో శార్దూల్ అంటే పులి అని అర్థం కాగా.. జొహన్నెస్‌బర్గ్‌లో అచ్చంగా పెద్దపులిలా విజృంభించిన ఠాకూర్ ఏడు వికెట్లతో ప్రత్యర్థిని అల్లాడించాడు. బౌన్సీ వికెట్‌పై వేగంతో కాకుండా తెలివితో సఫారీలను బోల్తా కొట్టించిన ఈ పాల్గఢ్ ఎక్స్‌ప్రెస్.. టీమ్ఇండియాను పోటీలోకి తీసుకురాగా.. తన శైలికి భిన్నంగా ఆడిన చతేశ్వర్ పుజారా.. ఇక్కడ పరుగులు రాబట్టడం బ్రహ్మవిద్యేం కాదని నిరూపించాడు! మరి మూడో రోజుమనవాళ్లు ఇదే జోరుతో ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశిస్తారా.. లేక స్వింగ్‌కు దాసోహమంటూ చాపచుట్టేస్తారా చూడాలి!!
జొహన్నెస్‌బర్గ్: పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (7/61) కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబర్చడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా మంచి స్థితిలో నిలిచింది. బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై శార్దూల్ విశ్వరూపం కనబర్చడంతో ఓవర్‌నైట్ స్కోరు 35/1తో మంగళవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. పీటర్సన్ (62), బవుమా (51) అర్ధశతకాలు సాధించగా.. ఎల్గర్ (28), వెరినె (21), జాన్సెన్ (21), కేశవ్ మహరాజ్ (21) తలా కొన్ని పరుగులు చేశారు. ఫలితంగా సఫారీలకు 27 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కాలి కండరాలు పట్టేయడంతో సిరాజ్ పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోగా.. ఆ లోటును భర్తీ చేస్తూ శార్దూల్ చెలరేగాడు. షమీ రెండు, బుమ్రా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మంగళవారం ఆట ముగిసే సమయానికి 85/2తో నిలిచింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (8), మయాంక్ అగర్వాల్ (23) పెవిలియన్ చేరగా.. సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా (42 బంతుల్లో 35 బ్యాటింగ్; 7 ఫోర్లు), అజింక్యా రహానే (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు తొలి సెషన్లో పుజారా, రహానే జోడీ ప్రొటీస్ పేసర్లకు ఎంతసేపు ఎదురు నిలుస్తుందనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే తప్పక రాణించాల్సిన ఒత్తిడిలో పుజారా.. రెండో రోజు తన శైలికి భిన్నంగా ఆడి ఆకట్టుకున్నాడు. కళాత్మక డ్రైవ్‌లతో మైదానం నలుమూలలా బౌండ్రీలతో పరుగుల వరద పారించాడు.
బుమ్రాలాంటి యార్కర్లు వేయకున్నా.. సిరాజ్‌లాంటి వేగం లేకున్నా.. షమీలాగా నిలకడ కనబర్చకున్నా.. వాండరర్స్‌లో శార్దూల్ వికెట్ల పంట పండించాడు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి.. 120-130 కిలోమీటర్ల వేగాన్ని కొనసాగించిన శార్దూల్ సమయానుకూలంగా బౌన్సర్లను వినియోగించుకుంటూ ఫలితం రాబట్టాడు. బుమ్రా, షమీ, సిరాజ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమై వచ్చిన సఫారీ ఆటగాళ్లకు శార్దూల్ మీడియం పేస్ తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఆఫ్‌స్టంప్ లైన్లోనే
బంతులేసుకుంటూ వెళ్లిన శార్దూల్ సఫారీలపై భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో పాటు టీమ్ఇండియాకు పేస్ ఆల్‌రౌండర్ లోటు తీర్చాడు!
భారత్ తొలి ఇన్నింగ్స్: 202, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 (పీటర్సన్ 62, బవుమా 51; శార్దూల్ 7/61, షమీ 2/52), భారత్ రెండో ఇన్నింగ్స్: 85/2 (పుజారా 35 నాటౌట్; జాన్సెన్ 1/18).