ముంబై: ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur).. హ్యాట్రిక్ తీశాడు. మేఘాలయాతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో అతను ఈ ఘనత సాధించాడు. ముంబైలోని శరద్ పవర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ఫస్ట్ మేఘాలయా బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మూడవ ఓవర్లో.. అతను వరుసగా అనిరుధ్ బీ, సుమిత్ కుమార్, జస్కీరత్లను ఔట్ చేశాడు. ఆ మ్యాచ్ ఫస్ట్ ఓవర్ నాలుగో బంతికే నిషాంత్ చక్రవర్తిని కూడా అతను ఔట్ చేశాడు.
ఈ ఏడాది రంజీ సీజన్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్గా నిలిచాడు శార్దూల్ ఠాకూర్. పాండిచ్చెరితో జరిగిన మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్ రిషి ధావన్ హ్యాట్రిక్ తీశాడు. రంజీ ట్రోఫీ మ్యాచుల్లో హ్యాట్రిక్ తీసిన అయిదో ముంబై బౌలర్గా నిలిచాడు. ముంబై తరపున హ్యాట్రిక్ తీసినవారిలో రోస్టన్ హరాల్డ్ డయాస్, అబ్దుల్ మూసాబాయ్ ఇస్మాయిల్, ఉమేశ్ నారాయణ్ కులకర్ణి, జహంగిర్ బేరామ్జీ కోట్ ఉన్నారు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు శార్దూల్ ఠాకూర్ 20 వికెట్లు తీసి 297 రన్స్ చేశాడు. దీంట్లో రెండు అర్థశతకాలు, ఓ శతకం ఉన్నది. తాజా సమాచారం ప్రకారం మేఘాలయా 13 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 37 రన్స్ చేసింది.