టోక్యో: టేబుల్ టెన్నిస్ పురుషుల రెండో రౌండ్లో ఆచంట శరత్ కమల్ విజయం సాధించాడు. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో చారిత్రక విజయం సొంతం చేసుకున్నాడు. 49 నిమిషాల్లోనే వరల్డ్ 59వ ర్యాంక్ ఆటగాడిని 2-11 11-8 11-5 9-11 11-6 11-9 స్కోర్‌తో మట్టికరిపించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనికా బాత్రా మూడో రౌండ్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ నాలుగో రోజు భారత క్రీడాకారులు వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆర్చరీ పురుషుల విభాగంలో, ఫెన్సింగ్ మహిళల విభాగంలో భారత్ తర్వాతి రౌండ్లకు దూసుకెళ్లాయి.
ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌తో కూడిన ఇండియన్ ఆర్చరీ టీం ఎలిమినేషన్లో కజకిస్థాన్‌పై విజయం సాధించింది. భారత ఆర్చరీ త్రయానికి కజక్ జట్టు ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆ జట్టుపై 6-2తో జయకేతనం ఎగురవేసిన భారత్.. క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఫెన్సర్ భవానీ దేవి ఘన విజయం సాధించింది. టునీషియాకు చెందిన నాజియా బెన్ అజిజ్‌పై 15-3 పాయింట్ల తేడాతో విన్ అయ్యింది.