అహ్మదాబాద్ : పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య ఐపీఎల్ ఫైనల్‌కు వేదికైన నరేంద్రమోదీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచంలోనే పెద్ద స్టేడియంగా పేరు గాంచిన మోతెరాలో కిక్కిరిసిన అభిమానుల మధ్య ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ శంకర్ మహాదేవన్ బృందం ఆలపించిన పాటలు ఫ్యాన్స్‌ను అమితంగా అలరించాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యానికి తగ్గట్లు జాతీయ స్ఫూర్తి ప్రతిబింబించేలా మహాదేవన్‌తో పాటు అతని కొడుకులు సిద్దార్థ్, శివమ్ పాడిన దేశభక్తి పాటలకు అభిమానుల ఈలలు, కేరింతలు తోడయ్యాయి.
వార్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న లక్ష్య సినిమాలోని ‘కందో సే మిల్తే హే కందె’ ‘యే వతన్ మేరే అబాద్ రహే తు’, ‘వందే మాతరమ్’ పాటలకు తగ్గుట్లు డ్యాన్సర్లు వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోయారు. వీటికి తోడు ‘దుష్మన్ కే చక్కే చుడాదే హమ్ ఇండియా వాలే’ పాటతో కార్యక్రమానికి మరో స్థాయి తీసుకెళ్లిన శంకర్..‘సబ్సే ఆగే హోంగే హిందూస్తానీ’ అనే పాటతో ఘనంగా ముగింపు పలికారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన 26 మంది అమాయకుల ప్రాణాలకు ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిటి నిర్వహించిన మిషన్ దేశ సైనిక శక్తిని ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పిన సంగతి తెలిసిందే.