Shane Warne Daughter : షేన్ వార్న్.. ఈ పేరు వినగానే ప్రపంచ క్రికెట్లోని మేటి బ్యాటర్లు సైతం వణికిపోతారు. తన అంతుచిక్కని బౌలింగ్‌తో రికార్డులు బద్ధలు కొట్టిన వార్న్(Shane Warne) అనతికాలంలోనే గొప్ప స్పిన్నర్‌గా పేరొందాడు. ఆస్ట్రేలియా జట్టును పలుమార్లు ఒంటిచేత్తో గెలిపించిన ఈ స్పిన్ దిగ్గజం కన్నుమూసి ఈ రోజు(మార్చి 4)తో రెండేండ్లు కావొస్తోంది.
ఈ లెజెండరీ బౌలర్ వర్థంతి సందర్భంగా అతడి కూతురు బ్రూకీ(Brooke) ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో తండ్రితో తన అనుబంధాన్ని, చిన్నప్పటి రోజులను ఆమె గుర్తుచేసుకుంది. ‘ఈ రోజుతో రెండు సంవత్సరాలు డాడీ. నువ్వు లేకుండా చాలా ఆలస్యంగా, చాలా వేగంగా గడిచిన రెండు ఏండ్లు ఇవి. ఇప్పటికీ నువ్వు మాతోనే ఉన్నావనే ఫీలింగ్ ఉంది. టీవీలో వచ్చే పీకీ బ్లౌండర్స్ క్రైమ్ డ్రామా కొత్త సీరీస్ గురించి కబుర్లు చెప్పుతున్నట్టే అనిపిస్తోంది. కానీ, నువ్వు లేకుండా జీవితం చప్పగా తోస్తోంది.
అయినా సరే మేము.. నువ్వు ప్రతిరోజు గర్వపడేలా చేస్తున్నాం. నిన్ను ఎంతో మిస్ అవుతున్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని బ్రూకీ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఆ పోస్ట్ చూసిన వార్న్ అభిమానులంతా చెమర్చిన కళ్లతో వార్న్ వీ మిస్ యూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేర్‌గా రాణించిన వార్న్ 52 ఏండ్ల వయసులో ప్రాణాలు విడిచాడు. థాయ్‌లాండ్‌లోని ఓ రిసార్ట్‌లో 2022 మార్చి 4వ తేదీన గుండెపోటుతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఆసీస్ క్రికెట్‌కు ఎనలేని గుర్తింపు తెచ్చిన వార్న్‌ను ఆ దేశ బోర్డు అరుదైన గౌరవం కల్పించింది. మెల్బోర్న్ క్రికెట్ మైదానం(MCG)లో అతడి బౌలింగ్ చేస్తున్నట్టు ఉన్న నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
అరంగేట్రం సిరీస్‌లోనే వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’తో సంచలనం సృష్టించాడు. ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో జరిగిన యాషెస్ సిరీస్‌లో తన ఓవర్ తొలి బంతికి వార్న్ మైక్ గాటింగ్(Mike Gatting)ను బౌల్డ్ చేశాడు. వాట్ ఏ మిరాకిల్ అంటూ ఆసీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. ఫ్లైట్ చేస్తూ విసిరిన ఆ బాల్ దిశ మార్చుకుని ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దాంతో, గాటింగ్ బిత్తరపోయాడు. అసలు తాను ఎలా ఔటయ్యాడో, ఏం జరిగిందో ఆ ఇంగ్లండ్ బ్యాటర్‌కు అర్థం కాలేదు.
వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ వీడియో