Shakib Al Hasan | కాన్పూర్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో తాను చివరి మ్యాచ్‌ను ఆడేశానని తెలిపాడు. పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన అతడు టెస్టుల విషయంలో మాత్రం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)పై భారం వేశాడు. అక్టోబర్‌లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టులో ఆడాలని అనుకుంటున్నానని, అలా జరగకుంటే భారత్‌తో కాన్పూర్ టెస్టే తనకు చివరిదని తెలిపాడు.
‘టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ స్థాయిలో నేను చివరి మ్యాచ్ ఆడేశాను. ఈ విషయమై ఇప్పటికే సెలెక్టర్లతో చర్చించాను. 2026 వరల్డ్ కప్ నేపథ్యంలో నాకంటే మెరుగైన ఆటగాళ్లు జట్టులోకి వస్తారని ఆశిస్తున్నా. నా సొంతమైదానం మీర్పూర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. వన్డేలలో మాత్రం వచ్చే ఏడాది జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆఖరిదని షకిబ్ తెలిపాడు.