IND vs PAK | టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఒకే ఇన్నింగ్స్‌లో బౌల్డ్ చేసిన తొలి బౌలర్‌గా పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిది ఘనత సాధించాడు. ఆసియాకప్ మూడో మ్యాచ్‌లో షాహీన్ దెబ్బకు భారత టాపార్డర్ కుప్పకూలింది. ఐదో ఓవర్లో అద్భుతం అనదగ్గ బంతితో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన షాహీన్.. తన తదుపరి ఓవర్లో విరాట్ కోహ్లీని కూడా బుట్టలో వేసుకున్నాడు. వర్షం కారణంగా పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై వరుణుడి విరామం అనంతరం షాహీన్ అద్భుత ఆరంభమిచ్చాడు. హాఫ్ వ్యాలీ బంతితో రోహిత్‌ను బౌల్డ్ చేసిన అతడు.. మరో చక్కటి డెలివరీతో కోహ్లీ పనిపట్టాడు. వికెట్‌కు దూరంగా వెళ్తున్న బంతిని విరాట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది కాస్తా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్ల మీద పడింది. దీంతో టీమ్ఇండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
టాపార్డర్ విఫలమైనా.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అర్ధశతకాలతో రాణించడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేయగలిగింది. టోర్నీ ఆరంభానికి ముందు నుంచే పాక్ బౌలర్లు, భారత బ్యాటర్ల మధ్య సమరంగా అభివర్ణించిన ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్లదే ఆధిక్యమైంది. ముఖ్యంగా తొలి స్పెల్‌లో షాహీన్‌ను ఎదుర్కోవడం కష్టం అని విశ్లేషకులు పేర్కొనగా.. ఆ మాటలే నిజమయ్యాయి.
ఈ మ్యాచ్‌లో పాక్ ఏస్ పేసర్ షాహీన్ షా అఫ్రిది తన వేగంతో టీమ్ఇండియాను ఇబ్బంది పెట్టగా.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. షాహీన్ వేసిన అద్భుత ఔట్ స్వింగర్‌ను రోహిత్ మిస్ చేయగా.. దాన్ని చూసిన కోహ్లీ కండ్లు పెద్దవి చేస్తూ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. దీంతో అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విరాట్ డైనోసర్‌ని చూశాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. మన బౌలర్లూ తక్కువేం కాదు అని మరొకరు పేర్కొన్నారు.
Kohli’s reaction 🤣🤣🤣🤣😭😭😭#INDvPAK pic.twitter.com/Z2EjYauaBJ
— Jon Snow aka Aegon Targaryen (@mjtheorem) September 2, 2023