దంబుల్లా: మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లను గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షఫాలీ వర్మ (48 బంతుల్లో 81, 12 ఫోర్లు, 1 సిక్స్) అంతగా అనుభవం లేని నేపాల్ బౌలర్లను ఉతికారేసింది. షఫాలీ, స్మృతి మంధాన స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన హేమలత (42 బంతుల్లో 47, 5 ఫోర్లు, 1 సిక్స్)తో తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఓపెనర్ల వికెట్లు కోల్పోయాక భారత స్కోరు వేగం నెమ్మదించింది. అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులే చేయగలిగింది. రాణా మగర్ (18) టాప్ స్కోరర్. దీప్తి శర్మ(3/13), రాధా యాదవ్ (2/12), అరుంధతిరెడ్డి(2/28) రాణించారు. సెమీస్‌లో భారత్.. థాయ్‌లాండ్ లేదా బంగ్లాదేశ్‌తో తలపడే అవకాశాలున్నాయి.