Serena Williams : ప్రపంచ టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్ (Serena Williams) ఎందరికో స్ఫూర్తి. టెన్నిస్‌లో
మకుటం లేని మహారాణిగా వెలుగొందిన ఆమె తన దూకుడైన ఆటతో ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో రికార్డు నెలకొల్పింది. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన అమెరికా నల్ల కలువ తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. యుక్త వయసులో బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పింది.
‘అప్పుడు నాకు 20 ఏండ్లు. యూఎస్ ఓపెన్ 20022 ఫైనల్ తర్వాత నేను సోదరి వీనస్ విలియమ్స్ (Venus Williams)తో వాషింగ్టన్ డీసీలో ఉన్నా. నాతో డేటింగ్లో ఉన్న వ్యక్తిని అక్కడ చూశాడు. ఆ తర్వాత రెండు వారాలు అతడి ఇంట్లోనే ఉన్నాను. ఒక వ్యక్తితో సన్నిహితంగా, ప్రేమగా ఉండడం నాకు అదే మొదటిసారి. అయితే.. నేను మా ఇంటికి వచ్చేశాక అతడు నన్ను వదిలేశాడు. కారణం సైతం చెప్పకుండా బ్రేకప్ చేశాడు.
దాంతో, నాకు చిర్రెత్తుకొచ్చింది. అతడిపై కోపంతో రగిలిపోయిన నేను టెన్నిస్ మీద మరింత ఫోకస్ పెట్టాను. నా మొదటి బాయ్‌ఫ్రెండ్ నన్ను చూసినప్పుడల్లా తప్పు చేశానని కుంగిపోయేలా చేయాలని గట్టిగా అనుకున్నా. అనుకున్నట్టుగానే నేను టెన్నిస్‌లో గొప్ప ఘనతలు సాధించా’ అని సెరెనా తన స్టోరీ చెప్పింది.అమెరికాకు చెందిన సెరెనా టెన్నిస్‌లో ఓ లెజెండ్. అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి ఆమె నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు.
అయితే.. వ్యక్తిగతంగా సెరెనా స్లామ్ మాత్రం ఆమెకు చాలా ప్రత్యేకం. 2002లో సెరెనా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత 2014- 15లో సెరెనా మరోసారి ఈ ఫీట్‌ను రిపీట్ చేసింది. దాంతో, టెన్నిస్‌లో నువ్వొక శిఖరం అంటూ యావత్ లోకమంతా సెరెనాకు సలాం కొట్టింది.
అక్క వీనస్ విలియమ్స్‌తో సెరెనా
తండ్రి రిచర్డ్ విలియమ్స్ ప్రోత్సాహంతో చిన్నప్పుడే సెరెనా రాకెట్ పట్టింది. 14 ఏండ్ల వయసు నుంచి కోర్టులో అద్భుతాలు చేసిన సెరెనా కెరీర్లో ఎదిగే క్రమంలో, అక్క అండతో చిరస్మరణీయ విజయాలు సాధించింది.
అయితే.. గాయాలు వెంటాడడంతో 2022 సెప్టెంబర్‌లో రాకెట్ వదిలేసింది. అమెరికాలోని సోషల్ మీడియా సంస్థ రెడ్డిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహనియన్ (Alexis Ohanian)ను 2017లో సెరెనా పెండ్లి చేసుకుంది. ఈ జంటకు అదే ఏడాది ఒలింపియా పుట్టింది. 2023లో మరోసారి సెరెనా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.