భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టుకు వేళయైంది. కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య నేటి నుంచి పోరు మొదలుకానుంది. చెన్నై టెస్టులో ఘన విజయంతో ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. పెట్టని కోటలాంటి సొంతగడ్డపై ప్రత్యర్థి బంగ్లాను చిత్తుచేసేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంది. తొలి టెస్టులో అశ్విన్, జడేజా, పంత్, గిల్ చెలరేగగా సీనియర్లు రోహిత్, కోహ్లీ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయారు.
సమిష్టి ప్రదర్శనతో కాన్పూర్‌లోనూ జయకేతనం ఎగురవేసేందుకు టీమ్ఇండియా కృతనిశ్చయంతో ఉంది. పిచ్ స్పిన్నర్లకు స్పందించనుందన్న వార్తల నేపథ్యంలో ఒక పేసర్‌ను తప్పించి మూడో స్పిన్నర్ తీసుకునే చాన్స్ ఉంది. ఇక పాకిస్థాన్‌పై సిరీస్ విజయంతో ఊపుమీద కనిపించిన బంగ్లా..భారత్ ముందు ఘోరంగా తేలిపోయింది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో పేలవ ప్రదర్శనతో భారీ ఓటమి మూటగట్టుకుంది. కనీసం రెండో టెస్టులోనైనా టీమ్ఇండియాకు పోటీనివ్వాలని బంగ్లా ప్రయత్నిస్తున్నది.
Kanpur Test | కాన్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నైలో ముగిసిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు.. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులోనూ జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. సిరీస్ క్లీన్‌స్వీపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న రోహిత్ సేన.. చెపాక్‌లో ప్రత్యర్థిని పేస్‌తో దెబ్బకొట్టగా కాన్పూర్‌లో స్పిన్ ఉచ్చులో బంధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సంప్రదాయకంగా స్పిన్‌కు అనుకూలించే గ్రీన్ పార్క్ స్టేడియంలో ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగి ప్రత్యర్థిని ‘తిప్పేయాలని’ భారత్ భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌పై చారిత్రక టెస్టు సిరీస్ విజయం అనంతరం భారీ ఆశలతో భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో తప్ప ఆశించిన స్థాయిలో రాణించలేక చతికిలపడి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండో టెస్టులో అయినా పుంజుకోవాలని చూస్తోంది.
అందరి కళ్లూ ఆ ఇద్దరి మీదే..
మొదటి టెస్టులో తొలి రోజు బంగ్లా పేసర్లు బెంబేలెత్తించినా అశ్విన్, జడేజా ఆదుకోగా రెండో ఇన్నింగ్స్‌లో గిల్, పంత్ శతకాల మోత మోగించడంతో ‘మెన్ ఇన్ బ్లూ’కు భారీ గెలుపు దక్కింది. అయితే మ్యాచ్ గెలిచినా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైఫల్యం అభిమానులను నిరాశపరిచింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఈ ఇద్దరూ చేసింది 34 పరుగులే. కాన్పూర్‌లో ఈ ద్వయం భారీ ఇన్నింగ్స్‌లు బాకీ పడింది. క్రీజులో కుదురుకుంటే భారీ స్కోరు చేయొచ్చని పిచ్ క్యూరేటర్ చెబుతున్న నేపథ్యంలో ‘రోకో’ ఎలా ఆడతారనేది ఆసక్తికరం! రోహిత్, కోహ్లీతో పాటు తొలి టెస్టులో కేఎల్ రాహుల్ సైతం ఆశించిన స్థాయిలో ఆడలేదు. రాబోయే నాలుగు నెలల్లో కీలక సిరీస్‌లు ఆడనున్న భారత్ ఈ ముగ్గురూ రాణించాలని కోరుకుంటోంది. యశస్వీ, గిల్, పంత్ జోరు కొనసాగిస్తే రోహిత్ సేనకు తిరుగుండదు.
బంగ్లా పుంజుకునేనా?
పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ ఇచ్చిన విజయంతో రెట్టింపు ఉత్సాహంతో భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లాకు ‘ఇక్కడ అంత వీజీ కాదు’ అన్న విషయం బోధపడటానికి పెద్ద టైమ్ పట్టలేదు. చెపాక్‌లో తొలి రెండు సెషన్లలో మినహా ఆ జట్టు ప్రయాణం టెస్టు ఆసాంతం ఒడిదొడుకుల మధ్యే సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు దారుణ వైఫల్యంతో ఆత్మరక్షణలో పడ్డ బంగ్లా.. ఆ తర్వాత భారత్ జోరుతో కాడి వదిలేసింది. మిడిలార్డర్లో బంగ్లాకు కీలకమైన ముష్ఫీకర్, లిటన్ దాస్, మోమినుల్ హక్‌తో పాటు మెహిది హసన్ మిరాజ్ విఫలమయ్యారు. కెప్టెన్ శాంతో రెండో ఇన్నింగ్స్‌లో ఒంటరిపోరాటం చేసినా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుండటంతో భారత స్పిన్నర్లను ఆ జట్టు ఏ మేరకు ఎదుర్కోగలదని ఆసక్తికరం.
తుది జట్టు సవాల్..
కాన్పూర్ పిచ్ స్వభావం దృష్ట్యా బంతి తక్కువ ఎత్తులో రావడమే గాక పిచ్ నెమ్మదిగా స్పందిస్తుంది. ఆట తొలి రెండు సెషన్లు మినహాయిస్తే పేసర్లకు ఇక్కడ ఆశించినంత సహాయం కష్టమే. కానీ మూడో రోజు నుంచీ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారుతుంది. ఈ నేపథ్యంలో భారత్.. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల ఫార్ములాతో బరిలోకి దిగనుంది. అలా జరిగితే ఆకాశ్ దీప్, సిరాజ్‌లో ఎవరో ఒకరు బెంచ్‌కే పరిమితమవక తప్పదు. అశ్విన్, జడేజాకు తోడుగా కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్‌ను తుది జట్టులో తీసుకునే అవకాశముంది. బంగ్లా కూడా పేసర్ నహిద్ రాణాను పక్కనబెట్టి స్పిన్నర్ తైజుల్ ఇస్లాంను ఫైనల్ లెవన్‌లో చేర్చనున్నట్టు సమాచారం.
జడ్డూకు ‘రికార్డు’ టెస్ట్
ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీస్తే రవీంద్ర జడేజా టెస్టులలో 300 వికెట్లు, మూడు వేల పరుగులు (3,122) పూర్తి చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత దక్కించుకుంటాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన వారిలో ఇయాన్ బోథమ్ (72 టెస్టులు) ముందుండగా జడేజా ఒక వికెట్ తీస్తే 73వ టెస్టులో ఈ రికార్డు సాధించినవాడు అవుతాడు.
వర్ష సూచన: మ్యాచ్‌లో తొలి మూడు రోజుల ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
బంగ్లాదేశ్: నజ్ముల్ హోసేన్ (కెప్టెన్), జకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫీకర్ రహీం, షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిది హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం/నహీద్ రాణా, హసన్ మహ్ముద్, టస్కిన్ అహ్మద్