SAvsAUS: వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్స్‌లో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపిస్తున్నది. వికెట్ల పతనాన్ని అడ్డుకున్న వరుణుడు.. తెరిపినిచ్చి మళ్లీ ఆట ఆరంభమయ్యాక క్రీజులో కుదురుకున్న హెన్రిచ్ క్లాసెన్ (48 బంతుల్లో 47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థుడు మార్కొ జాన్సెన్ వరుసబంతుల్లో ఔట్ అయ్యారు. ఆసీస్ పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్.. ఒకే ఓవర్లో క్లాసెన్, జాన్సెన్లను ఔట్ చేసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సఫారీలు ఆది నుంచే పెవిలియన్‌కు క్యూ కట్టారు. 11.5 ఓవర్లలో ఆ జట్టు 24 పరుగులు మాత్రమే చేసి నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే 14 ఓవర్ల తర్వాత ఆటకు వరుణుడు అంతరాయం కలిగించినా తర్వాత కొద్దిసేపటికే మళ్లీ మ్యాచ్ మొదలైంది. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సపారీలను క్లాసెన్ – మిల్లర్లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు కంగారూ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. ఇరువురూ ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. 19 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న ఈ జోడీని ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ విడదీశాడు.
2 in 2 For Travis Head
SA are 119-6 #SAvsAUS pic.twitter.com/LLwxVyK4mX— VINEETH𓃵🦖 (@sololoveee) November 16, 2023
ఆడమ్ జంపా వేసిన 27వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది జోరుమీదున్న క్లాసెన్.. హెడ్ వేసిన 31వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టి అర్థసెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా అదే ఓవర్లో నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే మార్కొ జాన్సెన్ కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో సఫారీలు ఆరో వికెట్ కోల్పోయారు. 33 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు.. ఆరు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేశారు. ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ ఒక్కడే బ్యాటర్. సౌతాఫ్రికా ఆశలన్నీ అతడిమీదే ఉన్నాయి. మిల్లర్ 73 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిల్లర్‌తో పాటు కొయెట్జ్ క్రీజులో ఉన్నాడు.