Saurabh – Divya : ఒక్క మ్యాచ్‌తో హీరో అయిన క్రికెటర్లు చాలామందే. కానీ, అదే ఫామ్‌ను కొనసాగించే వాళ్లు చాలా కొద్దిమందే. అది కూడా ఆడుతున్న తొలి ఐసీసీ(ICC) టోర్నీలోనే సంచన ప్రదర్శన చేయడం మామూలు విషయం కాదు. ఇదంతా ఎవరి గురించంటే.. ఇంకెవరు అమెరికా స్పీడ్‌స్టర్ సౌరభ్ నేత్రావల్కర్ (Saurabh Netravalkar) గురించే. అవును.. టీ20 వరల్డ్ కప్ టోర్నీతో ప్రపంచానికి తానేంటో చూపించాడు ఈ యువ ఇంజనీర్.
ఓ వైపు వృత్తిని, మరోవైపు ప్రవృత్తిని బ్యాలెన్స్ చేస్తే.. ప్రపంచ క్రికెట్లో ఆణిముత్యంగా ప్రశంసలు అందుకుంటున్న సౌరభ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. దాంతో, అతడి కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ సైతం ఆరాటపడుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, క్రికెటర్‌గా సౌరభ్ అంతలా సక్సెస్ అవ్వడానికి అతడి భార్య దేవి స్నిగ్ద ముప్పాల (Devi Snigdha Muppala) కూడా ఓ కారణం. భారత్‌కు చెందిన వీళ్లు నాలుగేండ్ల క్రితం పెండ్లితో ఒక్కటయ్యారు.
సౌరభ్‌ది మహారాష్ట్ర, దేవి స్వరాష్ట్రం బెంగళూరు. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఈ జంటది ఇంజనీరింగ్ అనుబంధం. అవును.. ఇద్దరూ అమెరికాలోని ఒరాకిల్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇక దేవి విద్యాభ్యాసం గురించి చెప్పాలంటే.. బెంగళూరులోని ‘రామయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇంజనీరింగ్ చదవింది.
అనంతరం న్యూయార్క్‌లోని ‘కార్నెల్ యూనివర్సిటీ’ నుంచి మాస్టర్స్ పట్టా అందుకుంది. కొన్నాళ్లు భారత అంతరిక్ష సంస్థలో దివ్య ఇంటర్న్‌గా పని చేసింది. చదువులోనే కాదు భారతీయ కళల్లోనూ ఆమెకు పట్టుంది. కథక్ డాన్స్(Kathak Dance)లో ప్రావీణ్యం సంపాదించడమే కాదు శిక్షణ ఇవ్వగలదు కూడా. సౌరభ్, దివ్యలు తమ ప్రొఫెషన్‌ను కొనసాగిస్తూనే తమకిష్టమైన రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఈ జంటను ప్రపంచం మెచ్చుకోకుండా ఎలా ఉండగలదు.
వరల్డ్ కప్ ఆరంభ పోరులో కెనడాపై ఒక్క వికెట్ తీయని సౌరభ్.. పాకిస్థాన్‌పై చెలరేగాడు. 18 పరుగులకే రెండు వికెట్లు తీసి పాక్‌ను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్లోనూ ఒక వికెట్ తీసిన సౌరభ్ జట్టు విజయంలో భాగమయ్యాడు. ఇక కీలకమైన టీమిండియా మ్యాచ్‌లో ఈ స్పీడ్‌స్టర్ అదరగొట్టాడు. వరుస ఓవర్లలో కోహ్లీ, రోహిత్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను అమెరికా వైపు తిప్పాడు. అయితే.. చివరకు సూర్యకుమార్, శివం దూబేల పోరాటంతో భారత్ బయటపడింది.