Thailand Open : థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) – చిరాగ్ శెట్టి (Chirag Shetty) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆరంభం నుంచి అదరగొడుతున్న ఈ జోడీ సంచలన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం సెమీఫైనల్లో అద్భుత ఆటతో మలేషియా జంటపై చెక్ పెట్టిన సాత్విక్ – చిరాగ్ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ సీజన్లో వీరికి ఇదే మొదటి ఫైనల్ కావడం విశేషం. ఫేవరెట్లు పీవీ సింధు, లక్ష్య సేన్ నిష్క్రమించినా భారత్‌కు పతకం ఖాయం చేసిందీ జోడీ.
భారత స్టార్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరో టైటిల్‌కు చేరువైంది. థాయ్‌లాండ్ ఓపెన్ సెమీఫైనల్లో తొలిసెట్ కోల్పోయినా.. సంచలన ఆటతో ఫైనల్ బెర్తు దక్కించుకుంది. మలేషియా షట్లర్లు గోహ్ జే ఫేయ్, నుర్ ఇజుదీన్ 21-19తో తొలి సెట్లో ఆధిక్యం చెలాయించినా భారత జంట కుంగిపోలేదు. రెండో సెట్లో గొప్పగా పుంజుకున్న సాత్విక్ – చిరాగ్ ద్వయం 22-20తో ప్రత్యర్తికి షాకిచ్చింది.
Turned around in the blink of an eye.
Follow live action: https://t.co/TjoFnU4PnB@HSBC_Sport
#BWFWorldTour #ThailandOpen2026 pic.twitter.com/Z6dMWQx0k7— BWF (@bwfmedia) May 16, 2026
అదే ఊపులో నిర్ణయాత్మక మూడో సెట్‌ను 21-16తో కైవసం చేసుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో వీరికి ఇది మూడో టైటిల్ పోరు. గతంలో 2019, 2024లో ఫైనల్ ఆడారు. తుది పోరులో లియో రాలీ – డానియల్ మార్టిన్(ఇండోనేషియా) లేదా హి జి టింగ్ – రెన్ గ్జియాంగ్ యూ(చైనా) జంటను సాత్విక్ – చిరాగ్ ద్వయం ఢీకొట్టనుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు(PV Sindhu), పురుషుల సింగిల్స్ నుంచి లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే.