కౌలాలంపూర్: ఈ ఏడాదిని విజయాలతో ఆరంభించేందుకు భారత షట్లర్లకు సువర్ణావకాశం! మంగళవారం నుంచే కౌలాలంపూర్ వేదికగా మలేషియా సూపర్ 1000 టోర్నమెంట్ మొదలుకానుంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత గాయాలు, ఇతరత్రా సమస్యలతో కాస్త వెనుకబడ్డ భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్-చిరాగ్ ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు సింగిల్స్ విభాగంలో స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్.. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ వంటి యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో మూడుసార్లు ఫైనల్ చేరి రెండు సార్లు టైటిల్ నెగ్గిన సాత్విక్ జోడీ.. గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ఈసారి మళ్లీ టైటిల్‌ను దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఆరంభ రౌండ్ల నుంచే ఈ జోడీకి కఠినమైన ప్రత్యర్థులు ఎదురుకానున్న నేపథ్యంలో వారిని ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరం.