హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లకు వేళయైంది. మే 1 నుంచి జూన్ 6వ తేదీ వరకు జంట నగరాలు సహా 33 జిల్లాల్లో శిక్షణాశిబిరాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్‌నకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, సాట్స్ ఎండీ సోనీబాలదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు.
ఈ నేపథ్యంలో శివసేనారెడ్డి మాట్లాడుతూ ‘ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా సాట్స్ ఏర్పాట్లు చేసింది. కోచింగ్ క్యాంప్‌ల్లో విద్యార్థులనే కాకుండా వారి తల్లిదండ్రులను భాగం చేసేందుకు ఉచితంగా యోగా, జుంబా డ్యాన్స్ శిక్షణ ఇవ్వబోతున్నాం. జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుం డా ఈసారి ఎంపిక చేసిన పట్టణాల్లో కూడా క్యాంప్‌లు ప్రారంభిస్తున్నాం. వేసవి శిక్షణాశిబిరాల కోసం విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకుని, వాటిని భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకుంటాం’ అని పేర్కొన్నారు.