SATS | హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడారంగ సమూల అభివృద్ధి కోసం త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘సాట్స్ కార్యక్రమాలు రాష్ట్ర మంతా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ క్రీడా రంగానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు నూతన పాలసీని తీసుకురాబోతున్నాం. ఇందులో భాగంగా ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం.
దీనికి తోడు మరో మూడు స్పోర్ట్స్ స్కూల్‌ను స్థాపించబోతున్నాం. వీటన్నింటినీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనుసంధానం చేస్తాం. హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చే క్రమంలో నగరంలో ఉన్న ప్రతీ స్టేడియాన్ని పునరుద్ధరిస్తాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి తగిన ప్రోత్సాహలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. క్రీడాభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.