హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ క్రీడారంగం అద్భుతమైన విజయాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల తరహాలోనే క్రీడా రంగాభివృద్ధి సాధించుకున్నాం. ఈ పదేళ్లలో తెలంగాణ క్రీడా ప్రగతి దేశానికే తలమానికంగా ఎదిగింది. క్రీడారంగ రిజర్వేషన్లు, నగదు ప్రోత్సాహకాల పెంపు, క్రీడా మైదానాల నిర్మాణం, గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు తదితర విప్లవాత్మక నిర్ణయాలతో క్రీడా రంగం ప్రగతి బాటలో దూసుకెళ్తోంది’ అని అన్నారు.