Sachin Tendulkar : వరల్డ్ క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు ఎందరున్నా.. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరు ఒక బ్రాండ్. దాదాపు మూడు దశాబ్దాలు తనదైన కవర్ డ్రైవ్స్, అప్పర్ కట్ షాట్లతో అభిమానులు అలరించాడీ దిగ్గం. కోహ్లీ, రోహిత్.. గిల్ తరం కుర్రాళ్లకు స్ఫూర్తిగా మారిన అతడి ఆటకు ఫిదా అవ్వని వారుండరంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్‌పై చెరగని ముద్రవేసిన సచిన్.. సరిగ్గా ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్లో మొదటి శతకం సాధించాడు. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వీరుడి ఆగమనాన్ని చాటిన ఆ సెంచరీకి 35 ఏళ్లు అవుతోంది.
భారత జట్టు 1990లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ (Old Trafford)లో జరిగిన రెండో టెస్టులో ఆగస్టు 14న ఇంగ్లండ్ మేటి బౌలర్లను ఎదుర్కొంటూ నాలుగో ఇన్నింగ్స్‌లో పదిహేడేళ్ల సచిన్ విశ్వరూపం చూపించాడు. రవి శాస్త్రి, నవ్‌జోత్ సిద్దూ, కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. జట్టును ఆదుకునేందుకు కంకణం కట్టుకున్నాడీ ముంబైకర్. 35 పరుగులకే 2 వికెట్లు.. ఆపై 109 వద్ద వరుసగా రెండు వికెట్లు పడడంతో టీమిండియా ఓటమి ఖాయమనుకున్నారంతా. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులతో మెరిసిన సచిన్.. అదే ఉత్సాహంతో అసమాన పోరాటపటిమతో క్రీజులో పాతుకుపోయాడు.
The first of 100 ✨ #OnThisDay in 1990, Sachin Tendulkar, all of 17, scored his maiden international century. What made it sweeter was that it came in Test-saving effort in the fourth innings at Old Trafford 🙌
Scorecard: https://t.co/EjeZt5e81K pic.twitter.com/66oomoerdj
— ESPNcricinfo (@ESPNcricinfo) August 14, 2025
డెవాన్ మాల్కొల్మ్, అంగుస్ ఫ్రేజర్, ఎడ్డీ హెమ్మింగ్స్ మైక్ ఆర్థర్టన్తో కూడిన పటిష్టమైన ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్నాడు. కపిల్ దేవ్(26), మనోజ్ ప్రభాక(67 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సచిన్ ఈక్రమంలోనే కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. 189 బంతుత్లో17 ఫోర్లతో 119 రన్స్ కొట్టి మ్యాచ్ డ్రాగా ముగిసేలా చూశాడు. టీనేజ్ నుంచే జట్టుకోసం నేనున్నా అనే ధోరణితో ఆడిన సచిన్ పేరు, ప్రతిష్టలు వచ్చాక కూడా అదే వైఖరితో ఉండేవాడు.
నూనూగు మీసాల వయసులోనే క్రికెట్లో ఎన్నో సంచలనాలు సృష్టించాడు టెండూల్కర్. అన్న అజిత్ ప్రోత్సాహంతో.. గురువు అచ్రేకర్ శిక్షణలో రాటుదేలిన సచిన్ యావత్ భారతం గర్వించదగ్గ క్రికెటర్‌గా అవతరించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రికార్డు స్కోర్ (1,5921).. వన్డేల్లో తొలి ద్విశతకం (2009లో దక్షిణాఫ్రికాపై).. ప్రపంచ కప్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. ఇలా మాస్టర్ బ్లాస్టర్ ఘనతలకు ఇలాంటి కొలమానాలు చాలానే.
భారత జట్టు అద్భుత విజయాల్లో భాగమైన సచిన్.. 2011 వన్డే వరల్డ్ కప్ విక్టరీతో తన ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకున్నాడు. అనంతరం రెండేళ్లకు .. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజ ప్లేయర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున తన మెరుపులతో అలరించాడు. ఆపై.. ముంబై మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆదే జట్టు తరఫున అర్జున్ టెండూల్కర్ 2024లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. దాంతో, ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడిన మొదటి తండ్రీకొడుకులుగా రికార్డు నెలకొల్పారిద్దరూ.