జైపూర్ : విజయ్ హజారే ట్రోఫీలో ఇవాళ ముంబై, పంజాబ్ మధ్య వన్డే మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఒక్క రన్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కేవలం 216 పరుగులకే ఆలౌటైంది. అన్మోల్ప్రీత్, రమణ్‌దీప్ సింగ్‌లు హాఫ్ సెంచరీ చేశారు. అయితే స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై జట్టు అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కానీ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. విజయ్ హజారే ట్రోఫీ వన్డే చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డను సొంతం చేసుకున్నాడు.
గతంలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా అతిత్ సేథ్ పేరిట ఉన్నది. ఆ బరోడా బ్యాటర్ 16 బంతుల్లో చత్తీస్‌ఘడ్‌పై అర్థసెంచరీ చేశాడు. 2020-21 సీజన్లో ఆ రికార్డు నమోదు అయ్యింది. ఇవాళ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్‌గేర్‌లో ఉన్న సర్ఫరాజ్ బౌలర్లను వణికించాడు. అభిషేక్ శర్మ వేసిన ఓ ఓవర్లో సర్ఫరాజ్ 30 రన్స్ రాబట్టాడు. అయితే 20 బంతుల్లో 62 రన్స్ చేసి సర్ఫరాజ్ ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి. కానీ ఆ తర్వాత పకడ్బందీగా బౌలింగ్ చేసిన పంజాబీ జట్టు ముంబైని కట్టడి చేసింది. పంజాబీ బౌలర్లలో గురునూర్ బ్రార్, మయాంక్ మార్కండేలు చెరి నాలుగేసి వికెట్లు తీసుకున్నారు.