Sarfaraz – Musheer: గత రెండేండ్లుగా జాతీయ జట్టలోకి రావాలని అహోరాత్రులు కష్టపడుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటున్న సర్ఫరాజ్ ఖాన్ కుటుంబానికి మంచిరోజులొచ్చాయి. గత వారం, పది రోజులుగా సర్ఫరాజ్ కుటుంబంలో పండుగ వాతావరణమే కనబడుతోంది. దేశవాళీలో నిలకడైన ప్రదర్శనలతో ఇండియా ‘ఎ’ టీమ్‌కు ఎంపికై అక్కడా మెరుస్తున్నాడు సర్ఫరాజ్. తాజాగా అతడు తాను ఎంతోకాలంగా వేచి చూస్తున్న జాతీయ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా సర్ఫరాజ్‌కు రెండో టెస్టులో చోటు దక్కింది. ఇక్కడ అన్న కథ ఇలా ఉంటే దక్షిణాఫ్రికాలో అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ సెంచరీల మీద సెంచరీలు బాదుతూ భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అండర్ – 19 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాలో భారత జట్టు తరఫున ఆడుతున్న ముషీర్ ఖాన్.. ఈ టోర్నీలో రెండు సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగులే చేసి నిరాశపరిచిన అతడు.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 118 పరుగులు చేశాడు. యూఎస్ఎతో మ్యాచ్‌లోనూ అతడు 73 పరుగులతో రాణించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ శతకం బాదాడు. ఇండియా అండర్ – 19, న్యూజిలాండ్ అండర్ -19 మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అతడు 109 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు.
Sarfaraz Khan’s father thanking the BCCI for trusting him.
– What a lovely day for Sarfaraz and his family. pic.twitter.com/axYRTcaEEU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2024
ముషీర్ ఖాన్ బ్యాటరే కాదు. స్పిన్‌తోనూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టగల మ్యాచ్ విన్నర్. అండర్ – 19 వరల్డ్ కప్ కంటే ముందే దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో అతడు బ్యాట్‌తో రాణిస్తూనే బౌలింగ్‌లో మెరిశాడు. ఈ సిరీస్‌లో అతడు 8 వికెట్లు పడగొట్టాడు. తాజాగా అండర్ – 19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 2022లో దేశవాళీలో ఎంట్రీ ఇచ్చిన ముషీర్.. అన్నతో కలిసి ముంబై రంజీ జట్టులో రాణిస్తున్నాడు.
Musheer Khan in this U-19 World Cup 2024:
– 3(7)
– 118(106).
– 73(76).
– 131(126).He is leading runs scorer in this World Cup – The future ⭐…!!!! pic.twitter.com/LCH2JpNguI
— CricketMAN2 (@ImTanujSingh) January 30, 2024
ఇక సర్ఫరాజ్ విషయానికొస్తే.. గత మూడు రంజీ సీజన్లలో సుమారు 80కి పైగా సగటుతో రాణించిన అతడు ఇండియా ‘ఎ’ తరఫున రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టులో మెరుగ్గా ఆడినా అతడికి ఇంగ్లండ్‌తో తొలుత ఎంపికచేసిన రెండు టెస్టులకు సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. కానీ రెండో టెస్టుకు ముందు కెఎల్ రాహుల్ గాయపడటం, కోహ్లీ గైర్హాజరీతో సర్ఫరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. తుది జట్టులో అతడికి చోటు దక్కుతుందా..? లేదా..? అనేది ఇంకా తేలాల్సి ఉన్నా ఒకవేళ అతడికి ఆడే అవకాశం దక్కితే అది సర్ఫరాజ్ కుటుంబానికి డబుల్ బొనాంజానే.