Raja Saab | పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో, భారీ కథలు,భారీ నిడివి ఉన్న సినిమాలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారాయి. ఈ ట్రెండ్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు రెబల్ స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేసింది. ఇప్పుడు అదే కోవలో ప్రభాస్ అభిమానులను థియేటర్లకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్–ఫాంటసీ థ్రిల్లర్‌ను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని మరింత హాట్ టాపిక్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలుగా ఖరారైంది. కథకు అవసరమైన ప్రతి సన్నివేశాన్ని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలపై జాగ్రత్తలు సూచించింది. ముఖ్యంగా ఒక హింసాత్మక సీన్లో మార్పులు చేయాలని సూచించగా, చిత్ర బృందం వెంటనే వాటిని అమలు చేసింది. అన్ని మార్పుల అనంతరం సినిమాకు UA16+ సర్టిఫికెట్ మంజూరు కావడం విశేషం. అంటే 16 ఏళ్లు దాటినవారు స్వేచ్ఛగా చూడొచ్చు, చిన్నవాళ్లు మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది. ఇక రిలీజ్ ప్లాన్ విషయానికి వస్తే.. సినిమాకు ముందుగానే భారీ ఎత్తున ప్రీమియర్ షోలను నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. జనవరి 8 రాత్రే స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తుండగా, తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి కోరారు.
అంతేకాదు, టికెట్ ధరల పెంపుపై కూడా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సింగిల్ స్క్రీన్లలో రూ.800 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.1000 వరకు టికెట్ ధరలు నిర్ణయించేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడితే వెంటనే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సినిమాలో ప్రభాస్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించబోతున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు జంటలుగా మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తుండగా, కీలక ప్రతినాయకుడి పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని అంటున్నారు.