Shreyas Iyer : ఆసియా కప్ స్క్వాడ్‌లో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లక్రితం స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో, ఆపై ఐపీఎల్ 18వ సీజన్లో అదరగొట్టిన అయ్యర్‌పై వేటు వేయడం ఏంటీ? అని మాజీలు సెలెక్టర్లను దుయ్యబడుతున్నారు. ఇదే వ్యవహారంపై శ్రేయాస్ తండ్రి సంతోష్ అయ్యర్ (Santhosh Iyer) తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డాడు. నా కుమారుడిలో ప్రతిభకు కొదవ లేదని.. కనీసం స్క్వాడ్‌లో సభ్యుడిగానైనా అతడిని తీసుకోవాల్సిందని సెలెక్టర్లపై ఆయన మండిపడ్డాడు. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న తమ అబ్బాయిపై ఎందుకీ కక్ష? అని ఆయన ప్రశ్నించాడు.
‘భారత టీ20 జట్టులోకి రావడానికి శ్రేయాస్ ఏమేం చేయాలో నాకు తెలియడం లేదు. గత కొంతకాలంగా అతడు ఐపీఎల్లో గొప్పగా ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అనంతరం పంజాబ్ కింగ్స్ తరఫున ఆటగాడిగానే కాదు కెప్టెన్‌గానూ అతడు అద్భుతంగా రాణించాడు. శ్రేయాస్ సారథ్యంలోనే కేకేఆర్ టైటిల్ సాధించింది. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు.
Shreyas Iyer’s father Santosh Iyer, speaks out on the omission of his son Shreyas Iyer from India’s squad for the Asia Cup 2025.#SantoshIyer #ShreyasIyer #Indiancricket #T20I #AsiaCup2025 #Insidesport #CricketTwitter pic.twitter.com/XxgURfFvFr
— InsideSport (@InsideSportIND) August 21, 2025
అయినా సరే ఆసియా కప్ స్క్వాడ్‌లో మా అబ్బాయి పేరు లేదు. ఇదెక్కడి అన్యాయమో నాకు అర్ధం కావడం లేదు’ అని సెలెక్టర్ల తీరును ఖండించాడు సంతోష్ అయ్యర్. అంతేకాదు ఐపీఎల్ సారథిగా హిట్ కొట్టిన తమ కొడుకుని టీమిండియా కెప్టెన్ చేయాలని తాను కోరడం లేదని కూడా ఆయన తెలిపాడు.
A stellar year for Shreyas Iyer, but no spot in Asia Cup 2025. Fair or unfair? 👀#AsiaCup2025 #ShreyasIyer pic.twitter.com/uB0AvB4yOv
— CricTracker (@Cricketracker) August 19, 2025
‘నేను మావాడిని భారత జట్టు కెప్టెన్ చేయాలని డిమాండ్ చేయడం లేదు. కనీసం జట్టులోకి ఆటగాడిగా అయినా తీసుకోవాలని కోరుతున్నా. సెలెక్టర్లు తనను పక్కనపెట్టేసినా అయ్యర్ మాత్రం డీలా పడేరకం కాదు. నా అదృష్టం ఇంతే. మీరు ఏం చేయలేరు అని అంటాడు. అంతేతప్ప తనకు చోటుదక్కలేదని ఎవరిపైనే దుమ్మెత్తిపోసే స్వభావం నా కుమారుడికి లేదు. కానీ.. ఎంత గొప్పగా ఆడినా జట్టులో లేనందుకు అతడు లోలోపల కుమిలిపోతున్నాడు’ అని శ్రేయాస్ తండ్రి భావోద్వేగంతో అన్నాడు.
ఆసియా కప్ స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.