దుబాయ్ : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో టీమ్ఇండియా క్రికెటర్లు బుమ్రా, శాంసన్ రేసులో నిలిచారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా, శాంసన్ అంచనాలకు మించి రాణించారు. మెగాటోర్నీలో తొలుత ఆడే అవకాశం దక్కించుకోలేకపోయిన శాంసన్ ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సాధికారిక ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా చిరస్మరణీయ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు.
ఈ క్రమంలో శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలువగా, ఫైనల్లో న్యూజిలాండ్‌కు చుక్కలు చూపించిన బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. వీరిద్దరికి తోడు దక్షిణాఫ్రికా బ్యాటర్ కానర్ ఎస్తర్హుజెన్ అవార్డు రేసులో శాంసన్, బుమ్రాతో పోటీపడుతున్నాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఎస్తర్హుజెన్ 145.98 స్ట్రైక్‌రేట్‌తో 200 పరుగులు కొట్టి సిరీస్ విజయంలో కీలకమయ్యాడు.