Sanjay Manjrekar : సుదీర్ఘ ఫార్మాట్‌ను ఎంతో ప్రేమించే విరాట్ కోహ్లీ (Virat Kohli) ఉన్నట్టుండి వీడ్కోలుతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తనదైన దూకుడుతో, కళాత్మక ఆటతో టెస్టు క్రికెట్ చూసేందుకు అభిమానులను స్టేడియాలకు రప్పించిన విరాట్ కొన్ని రికార్డులను అధిగమించకుండా వెళ్లాడు. ఫ్యాబ్-4లో ఒకడైన అతడి నిర్ణయం చాలామందిని బాధించింది. తాను కూడా కోహ్లీ వైదొలగడంపై కలత చెందానని అంటున్నాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar). శతకాలతో రికార్డులు నెలకొల్పుతున్న జో రూట్‌ను చూస్తుంటే తనకు కోహ్లీ గుర్తుకు వస్తున్నాడని మంజ్రేకర్ తెలిపాడు.
టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కితాబులందుకున్న విరాట్ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతాడని ఊహించారంతా. చూస్తుండగానే 30 శతకాలు బాదిన ఈ రన్ మెషీన్.. అత్యధిక సెంచరీలతో రికార్డు కొట్టేస్తాడని మాజీ ఆటగాళ్లు, అభిమానులు భావించారు. కానీ, కోహ్లీ మరో రెండేళ్లు ఆడగల సత్తా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతే.. అతడి సహచరులు కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్‌లు శతకాలతో ఇప్పుడు రెచ్చిపోతున్నారు. వీరిని చూసినప్పుడల్లా నాకు కోహ్లీని చూస్తే బాధేస్తుంది అని మంజ్రేకర్ తెలిపాడు.
‘టెస్టుల్లో జో రూట్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాడు. అతడని చూస్తే నాకు కోహ్లీ గుర్తుకొస్తాడు. అతడు చాలా ఈజీగా వీడ్కోలు చెప్పేశాడు. అంతకుముందు ఐదేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. కానీ, ఈ ఐదేళ్లలో తన సగటు ఎందుకు 31కి పడిపోయింది అని అతడు ఆలోచించలేదు. జో రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌ల మాదిరిగా విరాట్ తన బ్యాటింగ్ సమస్యలను సరి చేసుకునేందుకు, మళ్లీ ఫామ్ అందుకునేందుకు మనసు పెట్టి ప్రయత్నించలేదు. ఈ ముగ్గురు తమ పొరపాట్లను సరిదిద్దుకున్నారు కాబట్టే ఇప్పుడు రికార్డులతో వార్తల్లో నిలుస్తున్నారు. కానీ, కోహ్లీ ఇక చాలులే అనుకొని వీడ్కోలు పలికినందుకు బాధగా ఉంది’ అని ఇన్స్టాగ్రామ్ వీడియోలో మంజ్రేకర్ వెల్లడించాడు.
Most Int’l Centuries Since 2020 :
1) Joe Root 🏴- 27
2) Shubman Gill 🇮🇳- 19
3) Babar Azam 🇵🇰- 17
4) Travis Head 🇦🇺- 15
5) Shai Hope 🏝️- 14
6) Virat Kohli 🇮🇳- 14
7) Steve Smith 🇦🇺- 14
8) Kane Williamson 🇳🇿- 14– Joe Root is untouchable since 2020 🔥pic.twitter.com/u2gZb3oo6t
— Richard Kettleborough (@RichKettle07) January 5, 2026
టీమిండియాను టెస్టుల్లో నంబర్ 1గా నిలిపి.. తొలి సీజన్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడించిన విరాట్ కెరీర్‌ను 2021కి ముందు 2021కి తర్వాత అని చెప్పొచ్చు. 2019లో అతడి సగటు 54.97గా ఉండేది. కానీ, ఆఫ్‌స్టంప్ అవతల బంతులకు దొరికిపోయే కోహ్లీ బలహీనతను బౌలర్లు పసిగట్టి.. ఔట్ చేసేవారు. దాంతో.. అతడు మూడేళ్లలో ఒక్క సెంచరీ కొట్టలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఒకే ఒక సెంచరీతో ఫామ్ అందుకున్నట్టే కనిపించిన టీమిండియా స్టార్.. జూన్‌లో వీడ్కోలు పలికాడు. ఈ ఫార్మాట్లో 123 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు సాధించాడు.