జైపూర్: రాజస్థాన్ రాయల్స్ ఆఫ్ ఫీల్డ్ వివాదాలు జట్టు సంస్కృతికి మంచిది కాదని హెడ్కోచ్ కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. ఇటీవల రాయల్స్ సారథి రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో కోత విధించగా.. బీసీసీఐ కూడా క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. అంతకుముందు రాజస్థాన్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడి జరిమానాకు గురయ్యాడు. వీటిపై సంగక్కర స్పందించాడు. ‘ఎటువంటి వివాదాలైనా జట్టు సంస్కృతికి మంచివి కావు. ఆ ఘటనలపై బీసీసీఐ, ఫ్రాంచైజీ విచారణ చేపట్టాయి. జటు ్టపరంగా మా బృందంలో సానుకూల దృక్పథం ఉంది. ఓ జట్టుగా మా విలువలు మాకున్నాయి. అందరం వాటికి కట్టుబడి ఉంటాం’ అని అన్నాడు.