Sanju Samson : అవకాశాలు రానప్పుడు ఒకలా.. జట్టులోకి వచ్చాక మరోలా ఆడడం సంజూ శాంసన్(Sanju Samson)కే చెల్లుతుంది. అలాఅనీ పొట్టి క్రికెట్లో అతడికి అనుభవం లేదా? అంటే అదీ కాదు. ఐపీఎల్లో విధ్వంసక ఆటగాడిగా, సిక్సర్ల వీరుడిగా పేరుంది.. నిరుడు టీ20ల్లో సెంచరీలు కూడా కొట్టాడు. వరల్డ్‌కప్‌లో దంచేస్తాడులే అని సెలెక్టర్లు స్క్వాడ్‌లోకి తీసుకోగా.. సంజూ మాత్రం ఉసూరుమనిపిస్తున్నాడు. తోటి ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) జాలీగా సిక్సర్ల మోతతో విరుచుకుపడుతుంటే.. మనోడు మాత్రం చెత్త షాట్లతో చతికిలపడుతున్నాడు. ఆఖరి మ్యాచ్‌లోనూ అలానే ఆడితే వరల్డ్‌కప్‌లో బెంచ్ మీదే కూర్చోవాల్సి వస్తుందేమో.
ప్రతిభకు కొదవలేదు కానీ అదృష్టమే అతడివైపు లేదు అనే మాట సంజూ శాంసన్‌కు నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. ఎప్పుడో లో అరంగేట్రం చేసిన సంజూ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. అతడి వెనకాల వచ్చిన రిషభ్ పంత్, కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్ అదరగొడుతున్నారు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఏకంగా వన్డే, టెస్టు కెప్టెనయ్యాడు. కానీ, సంజూ ఇప్పటికీ జట్టులోకి ఇలా వస్తూ అలా వెళ్తున్నాడు. దీనికంతటికి కారణం.. నిలకడలేమి. అలవోకగా సిక్సర్లు కొట్టగల సత్తా ఉన్నా.. మ్యాచ్ గెలిపించగల ఆటగాడిగా పేరు సంపాదించలేకపోయాడీ కేరళ స్టార్.
Sanju Samson!! pic.twitter.com/SnaXqBiydx
— RVCJ Media (@RVCJ_FB) January 29, 2026
భారత జట్టు జెర్సీ ధరించే అవకాశం లక్షల్లో కొందరికే వస్తుంది. అలాంటి అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటారు కొందరు. కానీ, మరొకొందరు చేజేతులా టీమిండియాకు దూరమవుతుంటారు. సంజూ రెండో కోవకే చెందుతాడు. అవును.. గతంలోనూ అతడికి అవకాశాలిచ్చినా ఆకట్టుకోలేదు. ఈమధ్యే మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టులోకి వచ్చినా మళ్లీ ‘నా తీరింతే’ అన్నట్టుగా వరుస వైఫల్యాలతో సెలెక్టర్లు తలలు పట్టుకునేలా చేస్తున్నాడు.
స్వదేశంలో ఫిబ్రవరి 7 నుంచి జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం శాంసన్ ఎంపిక చేయడంతో అభిమానులు సంతోషించారు. సన్నాహక సిరీస్‌లో న్యూజిలాండ్‌పై తన స్టయిల్ పవర్ హిట్టింగ్తో జట్టు విజయాల్లో కీలమవుతాడని అందరూ భావించారు. కానీ, మనోడు మాత్రం షాట్ ఎంపికలో అయోమయానికి గురవుతూ.. కివీస్ బౌలర్లకు తేలికగా వికెట్ ఇచ్చేస్తున్నాడు.
“Just drop him” – Social media reacts as Sanju Samson perishes on 24 in IND vs NZ 2026 4th T20I https://t.co/2BvwHfe7kI pic.twitter.com/8H5iGSvTID
— Sportskeeda (@Sportskeeda) January 28, 2026
తొలి మ్యాచ్‌లో 10, రెండో గేమ్‌లో 6, మూడో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంజూ.. విశాఖలోనైనా చెలరేగుతాడనుకుంటే.. 24 పరుగులతో నిరాశపరిచాడు. చిట్టచివరి మ్యాచ్‌లోనైనా మెరిసి తన ఎంపిక సరైందేనని అతడు చాటుకుంటే సరి. లేదంటే.. వరల్డ్‌కప్‌లో అభిషేక్ శర్మ జతగా ఇషాన్ కిషన్(Ishan Kishan) ఓపెనర్ అవతారమెత్తినా ఆశ్చర్యమేమీ లేదు.
తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ దేశవాళీ క్రికెట్ ఫామ్‌ను కొనసాగిస్తూ కివీస్ బౌలర్లును బెంబేలెత్తిస్తున్నాడు. కాబట్టి.. ఒకవేళ తిలక్ కోలుకొని జట్టుతో కలిసినా.. ఈ లెఫ్ట్హ్యాండర్ను పక్కన పెట్టకపోవచ్చు. కాకపోతే ఓపెనింగ్ జోడీ కుడి, ఎడమ కాంబినేషన్లతో ఉండాలని కోచ్, కెప్టెన్ భావిస్తున్నారు. అందుకే సంజూను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగి అతడు మునపటిలా చెలరేగి ఆడగలిగితే వరల్డ్‌కప్‌లో ఆడుతాడు. లేదంటే బెంచ్ మీదను ఉండిపోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.