IPL 2025 : రాజస్థాన్ నిర్దేశించిన 174 పరుగుల ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(46), విరాట్ కోహ్లీ(18)లు దూకుడుగా ఆడుతున్నారు. అయితే.. ఇద్దరికీ లైఫ్ లభించింది. సందీప్ శర్మ వేసిన 4వ ఓవర్లో కోహ్లీ గాల్లోకి లేపిన బంతిని పరుగెడుతూ అందుకున్న రియాన్ పరాగ్ .. చివరకు వదిలేశాడు.
ఆ కాసేపటికే సందీప్ రిటర్న్ క్యాచ్‌ను జారవిడిచాడు. లైఫ్ లభించడంతో రెచ్చిపోయిన సాల్ట్.. సందీప్ వేసిన 6వ ఓవర్లో సిక్సర్ బాదాడు. ఆ తర్వాత ఫైన్‌లెగ్‌లో బౌండరీ సాధించాడు. దాంతో, ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 65 రన్స్ చేసింది. ఇంకా ఆ జట్టు విజయానికి 84 బంతుల్లో 109 పరుగులు కావాలి.
జైపూర్ వేదికపై మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పెద్ద స్కోర్ కొట్టలేకపోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (75) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగినా మిగతా బ్యాటర్లు దంచలేకపోయారు. పవర్ ప్లేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్‌కు అదిరే శుభారంభం దక్కలేదు. అయితే.. యశస్వీ జతగా రియాన్ పరాగ్(30) ధనాధన్ ఆడాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్(35 నాటౌట్) పోరాడడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగలిగింది.