న్యూయార్క్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో ఈజిప్ట్ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఓ దశలో వెనుకబడ్డ ఈజిప్ట్ ఆ తర్వాత పుంజుకుని వరల్డ్‌కప్ హిస్టరీలో చరిత్ర సృష్టించింది. వరల్డ్‌కప్‌లో అరంగేట్రం చేసిన దాదాపు 92 ఏళ్ల తర్వాత ఆ దేశం తొలిసారి మ్యాచ్ నెగ్గింది. ఈజిప్ట్ జట్టులో మొహమ్మద్ సలేహ్ కీలక ప్లేయర్‌గా నిలిచాడు. ఓ గోల్ చేయడంతో పాటు మరో గోల్‌కు అసిస్ట్ చేశాడు. వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఈజిప్ట్ ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. గ్రూప్ జీ నుంచి పోటీపడుతున్న ఈజిప్ట్.. టోర్నీ చరిత్రలో తొలిసారి రెండో దశకు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్‌లో న్యూజిలాండ్ లీడ్ తీసుకున్నది. ఫిన్ సుర్మన్ ఓ గోల్ చేశాడు. 15వ నిమిషంలోనే గోల్ కొట్టి జట్టుకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. కానీ సెకండ్ హాఫ్‌లో ఈజిప్ట్ ప్లేయర్లు దుమ్మురేపారు. కేవలం 24 నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేశారు. దీంతో గ్రూప్ జీ నుంచి ఆ జట్టు ప్రస్తుతం టాప్‌లో నిలిచింది. ఈజిప్ట్ నాలుగో సారి వరల్డ్‌కప్ ఆడుతోంది. 1934లో తొలిసారి ఆ దేశం వరల్డ్‌కప్ ఆడింది. ఒకవేళ శనివారం ఇరాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ దేశం గెలిస్తే వాళ్లు గ్రూప్ నుంచి నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఇంకా తన ఖాతాను తెరవలేదు. శనివారం బెల్జియంతో ఆ జట్టు ఆడనున్నది.