టెస్టు క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను బద్దలుకొట్టడం అసాధ్యమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ పదివేల పరుగుల క్లబ్ లో చేరడంతో సచిన్ టెండూల్కర్ రికార్డులను అతడు అధిగమస్తాడని చర్చ సాగుతున్న తరుణంలో సన్నీ స్పందించారు. టెస్టు క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడని, అయితే ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదని తెలిపారు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘టెస్టులలో సచిన్ అత్యధిక పరుగుల రికార్డు (15,921 పరుగులు)ను అధిగమించరానిది. రూట్.. సచిన్ ను అధిగమించాలంటే అతడు మరో 6 వేల పరుగులు చేయాలి. అంటే దానర్థం వచ్చే ఐదారేండ్లలో అతడు ఏడాదికి వెయ్యి పరుగుల చొప్పున చేయాల్సి ఉంటుంది..’ అని చెప్పారు. అయితే తీరిక లేని క్రికెట్ ఆడుతుండటం వల్ల అది ఫామ్ పై కూడా ప్రభావం చూపిస్తుందని సన్నీ అన్నారు.
‘అలెస్టర్ కుక్ (ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్) రిటైరైనా అతడింకా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. కొన్నిసార్లు మీరు తీరిక లేకి క్రికెట్ ఆడటం వల్ల అలిసిపోయి ఫామ్ కోల్పోయే ప్రమాదముంది. అది మీ మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీయొచ్చు. రూట్ ఇప్పుడు పరుగులు సాధిస్తూ ఉండొచ్చు కానీ అతడు అదే ఫామ్ ను కొనసాగించగలడా..?’ అని గవాస్కర్ ప్రశ్నించారు.
సచిన్ రికార్డులు అధిగమించడం కష్టమే అయినా ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదని సన్నీ చెప్పారు. ‘క్రికెట్ లో ఏదైనా సాధ్యమే. రిచర్డ్ హ్యడ్లీ మొదటిసారిగా 431 వికెట్ల (టెస్టులలో) రికార్డు నెలకొల్పినప్పుడు ఎవరైనా అది బ్రేక్ చేస్తారని ఊహించారా..? కానీ ఆ తర్వాత దాన్ని కోట్నీ వాల్ష్ బద్దలుకొట్టాడు కదా. ఆ తర్వాత ఆ రికార్డును కూడా మరికొంత మంది ఆటగాళ్లు బ్రేక్ చేశారు. ఆటలో ఏదీ అసాధ్యం కాదు. కానీ అదే సమయంలో అత్యంత కష్టమైనది (సచిన్ రికార్డు) కూడా..’ అని వ్యాఖ్యానించారు.