సఫారీ సవాల్ తొలిరోజు సమంగా నిలిచింది. ఇటు కేఎల్ రాహుల్ మొక్కవోని దీక్షతో అర్ధశతకం సాధించి అజేయంగా నిలిస్తే.. అటు కగిసో రబడ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. టాపార్డర్ విఫలం కాగా.. కోహ్లీ, శ్రేయస్ కాస్త పోరాడారు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ మరో సెషన్ మిగిలుండగానే వరుణుడి వల్ల ఆగిపోయింది. సీమ్‌కు సహకరిస్తున్న పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా పేసర్లు రెచ్చిపోయినా.. కీలక పరుగులు చేసిన టీమ్ఇండియా కూడా పోటీలోనే నిలిచింది. బుధవారం కూడా మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో మనవాళ్లు ఇంకెన్ని పరుగులు చేస్తారనేది ఆసక్తికరం!
సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలువాలనే పట్టుదలతో బరిలోకి దిగిన భారత జట్టు.. మొదటి రోజు పర్వాలేదనిపించింది. వర్షం ఆటంకం మధ్య ప్రారంభమైన బాక్సింగ్‌డే టెస్టులో.. పిచ్ పేసర్లకు సహకరిస్తున్న చోట మనవాళ్లు గొప్ప పోరాట పటిమ కనబర్చారు. ఫలితంగా మంగళవారం ఆట నిలిచే సమయానికి టీమ్ఇండియా 59 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్ ముందుగానే ముగిసింది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (105 బంతుల్లో 70 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) తలా కొన్ని పరుగులు చేశారు.
కెప్టెన్ రోహిత్ శర్మ (5), యశస్వి జైస్వాల్ (17), శుభ్‌మన్ గిల్ (2), రవిచంద్రన్ అశ్విన్ (8) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఏస్ పేసర్ రబడ 5 వికెట్లు పడగొట్టగా.. బర్గర్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తతుం రాహుల్‌తో పాటు హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ప్రసిద్ధ్ కృష్ణ టెస్టు అరంగేట్రం చేయగా.. రవీంద్ర జడేజా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు జట్టులో చోటు దక్కింది. ఒక దశలో 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును శ్రేయస్‌తో కలిసి కోహ్లీ ఆదుకోగా.. రెండో సెషన్ ఆరంభంలో రబడ రెచ్చిపోవడంతో భారత్ స్వల్ప వ్యవధిలో మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ అండతో పోరాడిన రాహుల్ జట్టు స్కోరు రెండొందలు దాటించాడు. బుధవారం కూడా మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే అవకాశం ఉండటంతో.. తొలి ఇన్నింగ్స్‌లో మన వాళ్లు మరెన్ని పరుగులు జోడిస్తారో చూడాలి.
మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ ఎందుకు గెలువలేకపోయింది. తొలి రోజు ఆట చూసిన వాళ్లకు అవగతమయ్యే ఉంటుంది. సాధారణంగానే పేస్‌కు అనుకూలించే సెంచూరియన్ పిచ్‌కు వరుణుడు తోడవగా.. రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. ఇంకేముంది తమకు అనుకూలించే పరిస్థితుల్లో సఫారీ పేసర్లు రెచ్చిపోయారు. అనూహ్య బౌన్స్, అదనపు స్వింగ్‌కు వారి వాయు వేగం తోడవడంతో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ చివరి బంతికి రోహిత్ తనకిష్టమైన పుల్‌షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్ కాగా.. కాసేపటికే మరో ఓపెనర్ జైస్వాల్ అతడిని అనుసరించాడు. గిల్ ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఈ దశలో మరో వికెట్ పడి ఉంటే.. టీమ్ఇండియా కోలుకోవడం కష్టమయ్యేదే.
కానీ, క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ అడ్డు నిలిచాడు. పుజారా, రహానే లేని లోటును పూరిస్తూ.. మొదట కాస్త ఆచితూచి ఆడిన ఆ తర్వాత సాధికారిక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతడికి శ్రేయస్ నుంచి మంచి సహకారం లభించింది. ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో రెండో సెషన్ ఆరంభంలో రబడ రెచ్చిపోయాడు. అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సఫారీ పేసర్.. కోహ్లీని ఒక అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. అశ్విన్ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. దీంతో భారత్ 121/6తో నిలిచింది. టెస్టు కెరీర్లో తొలిసారి వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్.. మిడిలార్డర్లో తన విలువ చాటుకున్నాడు. మంచి బంతులను గౌరవించిన రాహుల్.. చెత్త బంతి దొరికితే దానిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. అతడు చేసిన 70 పరుగుల్లో 52 రన్స్ బౌండ్రీల ద్వారానే వచ్చాయంటే అతడు ఎంత పర్ఫెక్ట్ షాట్లు ఆడాడో అర్థం చేసుకోవచ్చు. గత సఫారీ పర్యటన బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న రాహుల్.. ఈ సారి అంతకుమించిన విలువైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 208/8 (రాహుల్ 70 నాటౌట్, కోహ్లీ 38; రబడ 5/44, బర్గర్ 2/50).