మెల్బోర్న్: చివరి అంకానికి చేరిన ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా, కజకిస్థాన్ అమ్మాయి ఎలీనా రిబాకినా ఫైనల్ చేరారు. సెమీస్‌లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. గురువారం రాడ్లీవర్ ఎరీనా వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీస్‌లో సబలెంకా.. 6-2, 6-3తో స్విటోలినా (ఉక్రెయిన్)ను వరుస సెట్లలో మట్టికరిపించి సునాయస విజయం సాధించింది. గంటా 16 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రపంచ ఒకటో ర్యాంకర్.. పూర్తి నియంత్రణతో కూడిన దూకుడు ముందు స్విటోలినా నిలువలేకపోయింది. సబలెంకాకు ఇది నాలుగో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ కాగా హార్డ్కోర్టులలో వరుసగా ఏడోది కావడం విశేషం.
టోర్నీ ఆసాంతం రాణించి ప్రిక్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్‌ను ఓడించిన పెగులా (అమెరికా).. కీలక పోరులో ఐదో సీడ్ రిబాకినాకు తలవంచింది. ఇరువురి మధ్య జరిగిన రెండో సెమీస్‌లో రిబాకినా.. 6-3, 7-6 (9/7)తో ఆరో సీడ్‌కు షాకిచ్చింది. తొలి సెట్‌ను అలవోకగానే గెలుచుకున్న రిబాకినాకు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. పాయింట్ల కోసం ఇరువురూ చెమటోడ్చడంతో సెట్ టైబ్రేకర్‌కు వెళ్లింది. టైబ్రేకర్‌లోనూ పెగులా పోరాడినా సెట్పాయింట్ను కోల్పోవడం రిబాకినాకు కలిసొచ్చింది. ఈ టోర్నీలో ఆమెకు ఇది రెండో ఫైనల్. 2023లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె.. సబలెంకా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరి ఈసారైనా ఆమెను దాటి టైటిల్ దక్కించుకుంటుందా? అనేది ఆసక్తికరం. శనివారం ఈ ఇద్దరి మధ్య ఫైనల్ జరుగనుంది. తాజా టోర్నీలో భాగంగా ఈ ఇద్దరూ ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం గమనార్హం.