హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జోరుకు డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) బ్రేక్ వేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్‌ను ముందు బంతితో కట్టడి చేసిన చెన్నై.. ఆపై బ్యాట్‌తోనూ రాణించి రెండు పరాజయాల తర్వాత మళ్లీ విజయాల బాట పట్టింది. రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి తోడు తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ పేస్‌కు కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ విఫలమైంది. సీఎస్కే బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్న పిచ్‌పై కోల్‌కతా బౌలర్లు తేలిపోయారు. రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
చెన్నై : ఐపీఎల్-17లో రెండు పరాజయాల తర్వాత చెన్నై మళ్లీ విజయాల బాట పట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తుచేసింది. జడేజా (3/18) స్పిన్‌తో కేకేఆర్ టాపార్డర్‌ను బుట్టలో వేసుకోగా తుషార్ (3/33), ముస్తాఫిజుర్ (2/22) కట్టడిచేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. అనంతరం ఛేదనను సీఎస్కే ఆడుతూ పాడుతూ 17.4 ఓవర్లలో141/3 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 67 నాటౌట్, 9 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాకు ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కు తొలి బంతికే తుషార్ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ మొదటి బంతికే ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. కానీ ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న నరైన్.. తుషార్ వేసిన 3వ ఓవర్లో రెండు బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 19 పరుగులు రాబట్టి కేకేఆర్ స్కోరు వేగాన్ని పెంచాడు. మరో ఎండ్‌లో కొత్త కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ (24) సైతం మెరుపులు మెరిపించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 36 బంతుల్లోనే 56 పరుగులు జతచేసింది.
పవర్ ప్లే ముగిసేటప్పటికీ కేకేఆర్ స్కోరు 56-1. కానీ జడేజా రాకతో కోల్‌కతాకు వరుస కష్టాలు చుట్టుముట్టాయి. జడ్డూ తన తొలి బంతికే రఘువంశీని వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా అదే ఓవర్లో ఐదో బంతికి నరైన్.. లాంగాఫ్ వద్ద తీక్షణ చేతికి చిక్కాడు. తన తర్వాతి ఓవర్లో జడ్డూ.. వెంకటేశ్ అయ్యర్ (3) పని పట్టాడు. 12 బంతుల వ్యవధిలో కేకేఆర్ మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకోయింది. ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకున్న రింకూ సింగ్ (9)తో పాటు ప్రమాదకర ఆండ్రీ రస్సెల్ (10)నూ తుషార్ పెవిలియన్‌కు చేర్చాడు. తొలి ఐదు ఓవర్లలో 50/1 స్కోరు చేసిన కేకేఆర్.. ఆ తర్వాత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 87 పరుగులు మాత్రమే చేసింది.
ఛేదనలో చెన్నై కూడా ఆరంభంలో ఆచితూచి ఆడింది. స్టార్క్ వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రచిన్ రవీంద్ర (15) నాలుగో ఓవర్ వేసిన వైభవ్ బౌలింగ్‌లో చక్రవర్తికి క్యాచ్ మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ గైక్వాడ్ మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. మరో ఎండ్‌లో మిచెల్..క్లీన్‌బౌల్డ్ అయినా శివమ్ దూబే మెరుపులతో చెన్నై అలవోక విజయాన్ని అందుకుంది. దూబే ఔట్ అయ్యాక ధోనీ క్రీజులోకి వచ్చి అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు.
కోల్‌కతా : 20 ఓవర్లలో 137/9 (శ్రేయస్ 34, నరైన్ 27, జడేజా 3/18, తుషార్ 3/33)
చెన్నై : 17.4 ఓవర్లలో 141/3 (రుతురాజ్ 67 నాటౌట్, దూబే 28, వైభవ్ 2/28, నరైన్ 1/30)