ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని ధర దక్కించుకున్న ఆటగాడి నుంచి ఆ సీజన్లో ‘పైసా వసూల్’ ప్రదర్శనను ఆశించడం అత్యాశే! 2008లో మొదలైన ఈ లీగ్ చరిత్రలో ఇప్పటిదాకా నిర్వహించిన వేలం ప్రక్రియలలో ‘మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్’గా నిలిచిన ఆటగాళ్లు ఫీల్డ్‌లో ‘వారెవ్వా..’ అనిపించే ప్రదర్శనలు ఇచ్చిన దాఖలాల్లేవు. 2009లో నుంచి చరిత్ర చెబుతున్న సత్యమిదే. 2009లో ఇంగ్లండ్ దిగ్గజం ఫ్లింటాఫ్ను చెన్నై రూ. 9 కోట్లు వెచ్చించి తీసుకుంటే మూడు మ్యాచ్‌లలో అతడు చేసింది 62 పరుగులు, తీసింది 2 వికెట్లు. దీంతో చెన్నై అతడిని తర్వాత మ్యాచ్‌లు ఆడించే సాహసం చేయలేదు. అదే సీజన్లో కెవిన్ పీటర్సన్‌ను బెంగళూరు రూ. 9.8 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే 6 ఇన్నింగ్స్‌లలో అతడు చేసింది 62 రన్స్. 2015లో యువరాజ్, 2022లో ఇషాన్ కిషన్, 2023లో బెన్ స్టోక్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. తాజా సీజన్లో అదే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సీజన్ కోసం గత డిసెంబర్లో నిర్వహించిన వేలం ప్రక్రియలో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్ల జాక్‌పాట్ కొట్టిన రిషభ్ పంత్‌దీ అదే కథ. ఈ సీజన్లో ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన పంత్ చేసింది 17 పరుగులే. ఢిల్లీతో తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన పంత్.. తర్వాత హైదరాబాద్‌తో పోరులో 15 పరుగులకే ఔట్ అయ్యాడు. తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో 2 రన్స్‌కే వెనుదిరిగాడు.
పంత్ ఒక్కడే కాదు.. ఈ ఏడాది అధిక ధర పొందిన మరో ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (కోల్‌కతా- రూ. 23.75 కోట్లు) కూడా వైఫల్యాల బాట పట్టాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో 6 పరుగులే చేసిన అతడు.. ముంబైతో మ్యాచ్‌లో 3 రన్స్‌కే ఔట్ అవడంతో సోషల్ మీడియాలో అతడి ప్రదర్శన, ధరపై విస్తృతంగా ట్రోలింగ్ సాగుతున్నది. సాధారణంగా వేలంలో భారీ ధర దక్కించుకున్న ఆటగాడికి ‘ప్రైస్ ట్యాగ్’ ఒత్తిడి ‘తోడు తెచ్చుకున్న చుట్టం’ అయితే సారథ్య బాధ్యతలు అదనపు భారం! పంత్ ప్రస్తుతం రెండు సవాళ్లూ ఎదుర్కొంటున్నాడు. ఫీల్డ్‌లో అనవసరపు షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడంలో తనకు తానే సాటి అని గతంలో చాలాసార్లు నిరూపించుకున్న పంత్.. తాజా సీజన్లోనూ అదే ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆడిన షాటే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసలే గత సీజన్లో జట్టు విఫలమైనందుకు నాటి సారథి కేఎల్ రాహుల్‌తో స్టేడియంలోనే వాగ్వాదానికి దిగి అతడిని పక్కనబెట్టిన లక్నో యజమాని సంజీవ్ గొయెంకా.. ఏరికోరి తెచ్చుకున్న పంత్ ఇలా విఫలమవుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? అన్నది ఆసక్తికరం! రాబోయే మ్యాచ్‌లలో అయినా పంత్ తన ఆటతీరు మార్చుకోకుంటే రాహుల్ స్థానంలో పంత్ ఉండటం పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదని సోషల్ మీడియాలో ఇప్పటికే కామెంట్లు వినిపిస్తున్నాయి.