బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరోసారి సత్తాచాటింది. శుక్రవారం ఆ జట్టు చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసి ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదుచేసింది. జీటీ నిర్దేశించిన 206 పరుగుల ఛేదనను ఆర్సీబీ మరో ఏడు బంతులుండగానే దంచేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 81, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవ్‌దత్ పడిక్కల్ (27 బంతుల్లో 55, 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. అంతకుముందు సాయి సుదర్శన్ (58 బంతుల్లో 100, 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) వరుసగా మూడో సీజన్లోనూ శతకం బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 10 పాయింట్లతో రెండో స్థానానికి చేరగా నాలుగో ఓటమితో జీటీ ఏడో స్థానానికి పడిపోయింది.
లక్ష్య ఛేదనలో కోహ్లీ, పడిక్కల్ దూకుడుతో బెంగళూరు విజయం ఆ జట్టు ఇన్నింగ్స్ 14 ఓవర్లలోపే దాదాపు ఖరారైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన జాకబ్ బెతెల్ (14) విఫలమైనా కోహ్లీ, పడిక్కల్ ద్వయం రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి డిఫెండింగ్ చాంపియన్ విజయానికి బాటలు పరిచారు. సిరాజ్ తొలి ఓవర్లో ఇంకా ఖాతా తెరువకముందే కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను మిడ్ వికెట్ వద్ద వాషింగ్టన్ జారవిడువటం టైటాన్స్ కొంపముంచింది. ఆ తర్వాత కోహ్లీ.. పడిక్కల్ అండతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. పవర్ ప్లేలో 58/1తో ఉన్న ఆ జట్టు తర్వాత జోరు పెంచింది. కోహ్లీ ద్వయం.. రషీద్, ప్రిసిద్ధ్ను లక్ష్యంగా చేసుకోవడంతో పది ఓవర్లకు ఆ జట్టు 118/1తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. 30 బంతుల్లో కోహ్లీ, 27 బంతుల్లో పడిక్కల్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. అయితే ఛేదన దిశగా సాఫీగా సాగుతున్న ఆర్సీబీ.. నాలుగు ఓవర్ల వ్యవధిలో పడిక్కల్, కోహ్లీ, జితేశ్ శర్మ (10), కెప్టెన్ రజత్ (8)వికెట్లను కోల్పోయినా కృనాల్ (23*), డేవిడ్ (10*) లాంఛనాన్ని ముగించారు.
టైటాన్స్ ఇన్నింగ్స్‌లో భారీ మెరుపులేమీ లేకపోయినా సాయి వేగంగా ఆడుతూ రన్‌రేట్‌ను 10కి తగ్గకుండా చూసుకోవడంతో ఆ జట్టు ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే స్కోరును ఉంచగల్గింది. గిల్ 13 ఓవర్ల దాకా క్రీజులో ఉన్నా అతడు బ్యాట్ ఝుళిపించకపోయినా మరో ఎండ్‌లో సాయికి పూర్తి సహకారం అందించాడు. పవర్ ప్లేలో భువీ, రసిఖ్ ఓవర్లలో రెండేసి బౌండరీలు కొట్టిన సాయి.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో 4, 6, 4తో దూకుడు పెంచాడు. షెఫర్డ్ ఓవర్లోనూ సిక్స్‌తో 33 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. గిల్ జోరందుకోకపోయినా కృనాల్ బౌలింగ్‌లో సాయి రెండు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. సాఫీగా సాగుతున్న టైటాన్స్ ఇన్నింగ్స్‌కు సుయాశ్ షాకిచ్చాడు. 13వ ఓవర్లో అతడు వేసిన గూగ్లీని ఆడబోయిన టైటాన్స్ సారథి.. టైమింగ్ కుదరక పడిక్కల్‌కు క్యాచ్ ఇవ్వడంతో 128 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత అతడే వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసిన సాయి.. వరుసగా మూడో సీజన్లోనూ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు గేల్ (2011-13) పేరిట ఉండేది. కాగా శతకం తర్వాత సుదర్శన్.. హాజిల్‌వుడ్ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. బట్లర్ రెండు ఫోర్లు, 1 సిక్స్‌తో జోష్ మీదే కనిపించినా భువీ 18వ ఓవర్లో అతడి పనిపట్టడంతో టైటాన్స్ భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లినైట్టెంది. అయితే కృనాల్ ఆఖరి ఓవర్లో హోల్డర్ (10 బంతుల్లో 23 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులతో ఆ జట్టు స్కోరు 200 రన్స్ మార్కును దాటింది.
గుజరాత్: 20 ఓవర్లకు 205/3 (సాయి 100, గిల్ 32, భువనేశ్వర్ 1/31, సుయాశ్ 1/36);
బెంగళూరు: 18.5 ఓవర్లకు 206/5 (కోహ్లీ 81, పడిక్కల్ 55, రషీద్ 2/49, సిరాజ్ 1/25)