ఒకప్పుడు సూపర్స్టార్ల జట్టు.. ఇప్పుడు ఐపీఎల్‌ను శాసించే పవర్‌హౌస్! వ్యక్తిగత రికార్డులకే పరిమితమనే ముద్రను చెరిపేస్తూ.. నిఖార్సైన మ్యాచ్ విన్నర్ల సమష్టి బలంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా వెంటాడిన ‘సూపర్‌స్టార్ సంస్కృతి’కి పూర్తిగా స్వస్తి పలికి, ప్రతి మ్యాచ్‌లోనూ ఒక కొత్త హీరోను పరిచయం చేసిన బెంగళూరు.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌కు బ్రేకులు వేసి వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ముంబై, సీఎస్కేల రికార్డులను సమం చేస్తూ వరుసగా రెండు టైటిళ్లతో లీగ్‌పై తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. 18 ఏండ్ల టైటిల్ నిరీక్షణకు గతేడాది తెరదించిన ఆర్సీబీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలతో అండర్ అచీవర్స్ నుంచి తిరుగులేని పవర్‌హౌస్‌గా మారడం నిజంగా ఓ అద్భుతం.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : గత రెండు దశాబ్దాలుగా ఆర్సీబీ గుర్తింపు అంతా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి కొద్దిమంది వ్యక్తిగత సూపర్స్టార్ల చుట్టూనే తిరిగేది. ప్రత్యర్థులకు ఒక సమష్టి జట్టుతో కాకుండా కేవలం కొందరు వ్యక్తులతో ఆడుతున్న భావన కలిగేది. అయితే, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఆర్సీబీ ఈ సంస్కృతిని పూర్తిగా మార్చేసింది. విరాట్ కోహ్లీ జట్టుకు ప్రధాన బలంగా ఉన్నప్పటికీ, గెలుపు బాధ్యతను అందరికీ వికేంద్రీకరించింది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌లలో ఏకంగా తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకోవడమే దీనికి నిదర్శనం. ఒకరిద్దరు పెద్ద ఆటగాళ్లు విఫలమైనా జట్టు కుప్పకూలకుండా మిగతా వారు బాధ్యత తీసుకున్నారు.
విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజం నీడలో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రజత్ పాటిదార్ తీవ్ర ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ, ఎలాంటి హడావుడి లేకుండా జట్టును నడిపించాడు. బయట వచ్చే విమర్శలు, అనవసర వార్తల ప్రభావం జట్టుపై పడకుండా ఒక కవచంలా నిలిచాడు. మేనేజ్మెంట్ వ్యూహాలను మైదానంలో పక్కాగా అమలు చేస్తూనే, మిడిల్ ఆర్డర్లో విధ్వంసకర హిట్టర్‌గా మారి ఈ టోర్నమెంట్లో ఏకంగా 42 సిక్సర్లు బాదాడు.
ఆర్సీబీ ఆధిపత్యానికి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిలో వచ్చిన వ్యూహాత్మక మార్పు ప్రధాన కారణం. టీ20ల్లో తన స్ట్రైక్ రేట్‌పై గతంలో వచ్చిన విమర్శలకు సమాధానమిస్తూ, కోహ్లీ ఈసారి పవర్‌ప్లేలోనే ప్రత్యర్థులపై విరుచుకుపడే అగ్రెసివ్ బ్యాటర్‌గా మారాడు. తన కెరీర్లోనే అత్యుత్తమంగా 164కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఆరంభం నుంచే భారీ షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. దీనివల్ల మిగతా బ్యాటింగ్ ఆర్డర్‌పై ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయింది.
ప్రత్యర్థులను బ్యాటింగ్‌తోనే పూర్తిగా అధిగమించేలా ఆర్సీబీ ఒక భయానక బ్యాటింగ్ విభాగాన్ని నిర్మించింది. హై-రిస్క్, హై-రివార్డ్ విధానాన్ని నమ్ముకుంటూ ప్రతి మ్యాచ్‌లోనూ 200కు పైగా పరుగులు సాధించేలా ప్రణాళికలు రచించింది. బ్యాటింగ్‌లో కోహ్లీతో పాటు టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యాతో కూడిన లైనప్ జట్టుకు భారీ స్కోర్లను అందించింది. దేశవాళీల్లో అదరగొట్టిన యువ స్టార్ దేవదత్ పడిక్కల్ సైతం తన ఫామ్‌ను ఇక్కడా కొనసాగించాడు. గాయాలు లేదా ఆటగాళ్ల లభ్యత లేకపోవడాన్ని తట్టుకునేలా జట్టు బ్యాకప్‌ను బలంగా ఉంచారు. భారీ ధర పెట్టి కొన్న వెంకటేష్ అయ్యర్‌కు, ఫిల్ సాల్ట్ గాయపడితే తప్ప తుది జట్టులో చోటు దక్కలేదంటే జట్టు సమతూకం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్నస్వామి స్టేడియం లాంటి హై-స్కోరింగ్ మైదానంలో ఆర్సీబీకి బౌలింగ్ ఎప్పుడూ ఒక బలహీనతగా ఉండేది.
కానీ గత మెగా వేలంలోనే మేనేజ్మెంట్ తెలివిగా వ్యవహరించి పటిష్ఠమైన బౌలింగ్ విభాగాన్ని నిర్మించింది. భారత్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ స్వింగ్, డెత్ ఓవర్ల నైపుణ్యంతో మెరిశాడు. అతనికి జోష్ హేజిల్‌వుడ్ ఖచ్చితత్వం తోడైంది. వీరితో పాటు జాకబ్ డఫీ, దేశవాళీ పేసర్ రసిఖ్ సలామ్ దార్ వైవిధ్యమైన బంతులతో రాణించారు. కృనాల్ పాండ్యా మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రిస్తూ అత్యంత కీలకమైన డిఫెన్సివ్ బౌలర్‌గా మారగా, సుయాష్ స్పిన్ బలం కూడా తోడైంది. ఆండీ ఫ్లవర్ దూకుడు వ్యూహాలకు, మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ తెరవెనుక చేసిన ప్రణాళికాబద్ధమైన కృషి తోడవడంతో జట్టులో గందరగోళం పోయి స్పష్టత వచ్చింది.
ఐపీఎల్లో అత్యధిక సార్లు విజేతలైన ముంబై ఇండియన్స్, సీఎస్కే జట్లు ప్రస్తుతం లయ తప్పి నిరాశపరుస్తున్నాయి. 2024లో టైటిల్ గెలిచిన కేకేఆర్ కూడా కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో డీలా పడింది. కానీ ఆర్సీబీ మాత్రం నిండా మ్యాచ్ విన్నర్లతో కళకళలాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా ఉంది. ఇటీవల ఆర్సీబీని అమ్మకానికి పెట్టినప్పుడు అత్యధిక రేటు రాగా, ఒకవేళ ఈ ఫైనల్ ముగిసిన తర్వాత గనుక ఆ డీల్ సెట్ అయి ఉంటే, ఈ జట్టు బ్రాండ్ విలువ 20 వేల కోట్లు దాటేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సీజన్లో ఆర్సీబీకి అత్యంత ప్రతికూల అంశం.. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ పరిమితం అవ్వడం. గత ఏడాది ట్రోఫీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడం, ఆ తర్వాత వచ్చిన ప్రతికూలతలు, విమర్శలు ఆర్సీబీని బాగా వెంటాడాయి. ఈ సీజన్ ఆరంభం వరకూ చిన్నస్వామి స్టేడియంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సీజన్లో కేవలం ఐదు మ్యాచ్‌లను మాత్రమే ఆర్సీబీ చిన్నస్వామిలో ఆడింది. ప్లేఆఫ్స్, ఫైనల్‌ను కూడా సొంతగడ్డపై ఆడే అవకాశం కోల్పోయినా.. అన్ని ప్రతికూలతలను అధిగమించి మరీ కప్పు కొట్టి ఐపీఎల్లో తమ ఆధిపత్యాన్ని చాటింది.